సాక్షి, రాజంపేట(కడప) : కువైట్‌లో జిల్లా వాసుల అరెస్టు టెన్షన్ రోజురోజుకు పెరుగుతోంది. నాలుగు రోజులు దాటిపోతున్నా విడుదల విషయంలో కువైట్ ప్రభుత్వం కనికరం చూపడం లేదని బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని రాజంపేట, రాయచోటి, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప తదితర ప్రాంతాలకు చెందిన వారు దాదాపు లక్ష మంది గల్ఫ్‌దేశాలకు జీవనోపాధి కోసం వెళ్లారు.
నిరసన తెలిపినందుకు బందీఖానా ఉచ్చు..
వరంగల్‌లో చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటనపై స్పందించిన కువైట్ దేశంలోని ప్రవాసాంధ్రులు శుక్రవారం మాల్వియా ప్రాంతంలో నిరసన తెలిపారు. దీంతో వారు బందీ ఖానాలో చిక్కుకోవాల్సి వచ్చింది.
ఏయే జైళ్లలో ఉన్నారు..
కువైట్ దేశంలో ఉంటూ అక్కడి చట్టాలు తెలియకపోవడంతో ప్రవాసాంధ్రులు జైలు పాలయ్యారు. తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన ఈ కేసు విషయంలో విదేశాంగ మంత్రిత్వశాఖ జోక్యం చేసుకోవాలనే విజ్ఞప్తులు వెళుతున్నాయి. వీరంతా కువైట్ దేశంలోని షామియా, మాలియ, సులేబియా జైళ్లలో ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ప్రవాసాంధ్రులకు సంబంధించిన కొంతమంది పెద్దలు వీరి విడుదల కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
విడుదల చేస్తారా? చేయరా?
జీవనోపాధి కోసం వెళ్లిన తమ వారు అరెస్టు కావడంతో వారి సంబంధీకులు విడుదల చేస్తారా? చేయారా అనే ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. కాగా గల్ఫ్ దేశంలో నిరసన సభ, ప్రదర్శన నిర్వహించడం తీవ్ర నేరం. దీనికి జైలుశిక్ష పూర్తయినా తర్వాత వీసా రద్దు చేసి ఏ గల్ఫ్‌దేశంలోనూ అడుగుపెట్టకుండా జీవిత కాలం నిషేధం విధిస్తారనే ప్రచారం జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఒకే ఒక్కడు విడుదల..
నిరసన సందర్భంగా కువైట్ నిఘా అధికారులు అరెస్టు చేసిన వారిలో ఒక్కరిని మాత్రం వదిలి వేసినట్లుగా కువైట్ ప్రవాసాంధ్రుల వర్గాల నుంచి అందిన సమాచారం. విడుదలైన ఆ ఒక్కరికి, ఆ దేశంలోని పలుకుబడి కలిగిన షేఠ్ సిఫార్సుతో కువైట్ పోలీసులు విడుదల చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
విదేశాంగమంత్రిని కలిసిన రాజంపేట ఎంపీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి మంగళవారం కేంద్ర విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ అరెస్టు అయిన వారిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని అభ్యర్ధించారు.
ఇండియన్ ఎంబీసీకి డిప్యూటీ సీఎం లేఖ..
కువైట్‌లో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టిన సందర్భంగా అరెస్టు అయిన వారిని వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా కువైట్‌లోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. ఈ లేఖను రాయబార కార్యాలయ అధికారి హెచ్‌ఈ కె.జీవసాగర్‌కు పంపారు. అలాగే ఇదే ప్రతిని ప్రధానమంత్రి కార్యాలయానికి, విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపారు.
పట్టువదలని కువైట్ ప్రభుత్వం.?
కువైట్ దేశం నిరసన వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటోంది. అరెస్టయిన 52 మందిలో జిల్లాకు చెందిన వారితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు. తమ వారిని విడిపించాలని అరెస్టు అయిన వారి కుటుంబీకులు వేడుకుంటున్నారు. కువైట్ దేశంలో ఉన్న ప్రవాసాంధ్రులు అరెస్టు అయిన వారి కోసం ఇండియన్ ఎంబసీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment