వైఎస్సార్‌ విన్నపంతోనే ఏపీకి కియా | AP Assembly Budget Sessions Started | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

Published Mon, Jul 15 2019 9:09 AM | Last Updated on Mon, Jul 15 2019 2:40 PM

AP Assembly Budget Sessions Started - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ మొదలైంది. సభ ప్రారంభం కాగానే విపక్షం తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలపై చర్చకు అమతించాలని కోరగా, ముందు ప్రశ్నోత్తరాల కార‍్యక్రమం కొనసాగుతుందని స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం ఉభయసభల్లో బడ్జెట్‌పై చర్చ జరగనుంది.

వైఎస్సార్‌ విన్నపంతోనే ఏపీకి కియా
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విన్నపంతో కియా మోటార్స్‌ మొదటి ప్లాంట్‌ను ఏపీలో పెట్టారని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కియా మోటార్స్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాసిందని ఆయన వెల్లడించారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ 2007 నుంచే వైఎస్సార్‌తో తనకు అనుబంధం ఉందని కియా సీఈఓ లేఖలో స్పష్టంగా చెప్పారు. ఆటో మొబైల్స్‌లో పెట్టుబడులు పెట్టాలని వైఎస్సార్‌ 2007లోనే  తనకు చెప్పారని కియా సీఈఓ లేఖలో రాశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 38 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. చంద్రబాబులా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరగలేదు. ప్ర‌క్క‌న ఉన్న త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రుల విదేశీ ప‌ర్య‌ట‌న‌ల గురించి ఎప్పుడైనా విన్నామా? ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కూడా చంద్ర‌బాబు తిరిగిన‌ట్లు తిర‌గ‌లేదు. చంద్ర‌బాబు 39 కోట్ల ప్ర‌జాధనం ఖ‌ర్చు పెట్టి విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేశార’’ని అన్నారు.

చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు విదేశీ పర్యటనల ఖర్చుతో ప్రజలపై భారం పడిందని అన్నారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు రూ.39కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఆయన విదేశీ పర్యటనలపై విచారణ జరిపించాలన్నారు. తప్పుడు హామీలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారని తెలిపారు. ఏపీకి ఐటీ సంస్థలు వస్తున్నాయని నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ఐదు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారని, ఆయన అనుభవంతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ 2014 న‌వంబ‌రులో జ‌పాన్ వెళ్లి మ‌న రాష్ట్ర విద్యాల‌యాల్లో జ‌పాన్ భాష నేర్పిస్తామ‌ని, ఉద్యోగ క‌ల్ప‌న చేస్తామ‌న్నారు. 2015 జ‌న‌వ‌రిలో దావోస్ వెళ్లి బుల్లెట్ ట్రైన్ తెస్తామ‌న్నారు. మ‌లేషియా త‌ర‌హాలో బుద్ధిజం టూరిజం అభివృద్ధి చేస్తామ‌న్నారు. 2015 ఏప్రిల్‌లో చైనా వెళ్లి షాంఘై త‌ర‌హాలో అమ‌రావ‌తి నిర్మిస్తామ‌ని, ఎల‌క్ట్రానిక్ హ‌బ్ ఏర్పాటు చేసి సోలార్ ప‌రిశ్ర‌మ‌లు తెస్తామ‌న్నారు. 2015 జులైలో జ‌పాన్ వెళ్లి.. టోక్యోలా అమ‌రావ‌తి నిర్మిస్తామ‌న్నారు. ఇండ‌స్ట్రియ‌ల్ టౌన్ షిప్ క‌డ‌తామ‌న్నారు. విశ్వ‌న‌గ‌రంగా అమ‌రావ‌తి అన్నారు. వివిధ రంగాల్లో జ‌పాన్ కంపెనీలు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి సిద్ధంగా ఉన్నాయ‌ని వాటికోసం ఇండ‌స్ట్రియ‌ల్ టౌన్ షిప్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు. వాటి ప్ర‌తిపాద‌న‌లు ఎక్క‌డున్నాయి. 2015 సెప్టెంబ‌రులో సింగ‌పూర్ వెళ్లారు. విశ్వ‌న‌గరంగా అమ‌రావ‌తి నిర్మిస్తామ‌న్నారు.

రాజ‌మండ్రిలో సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్‌, రూ.2,000 కోట్ల‌తో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని అన్నారు. 2016 మార్చిలో లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో అమ‌రావ‌తి నిధుల స‌మీక‌ర‌ణ‌కు లండ‌న్ స్టాక్ ఎక్చేంజి అంగీక‌రించింద‌ని చంద్ర‌బాబు అన్నారు. 2016లో చైనా ప‌ర్య‌ట‌న చేసి మ‌ళ్లీ రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ తెస్తామ‌ని చంద్ర‌బాబు అన్నారు. 10వేల కోట్ల‌తో గ్యాస్ ఆధారిత ఎరువుల క‌ర్మాగారం అన్నారు. కార్గో హ‌బ్‌గా కృష్ణ‌ప‌ట్నం, విశాఖ చేస్తామ‌ని చంద్ర‌బాబు అన్నారు. 2016 జులైలో ఖ‌జ‌కిస్తాన్ వెళ్తే.. ఖ‌జ‌కిస్తాన్‌లా అమ‌రావ‌తిని నిర్మిస్తామ‌ని అన్నారు. 2016 ర‌ష్యా పర్య‌ట‌న చేశారు. రాష్ట్రంలో మెరైన్ యూనివర్శిటీ తెస్తామని చంద్ర‌బాబు అన్నారు. అమ‌రావ‌తికి మాస్కో స‌హ‌కారం తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు అన్నారు. 2017 జ‌న‌వ‌రిలో శ్రీ‌లంక వెళ్లి శ్రీ‌లంక ద్వీపాల త‌ర‌హాలో భ‌వానీ ద్వీపాన్ని అభివృద్ధి చేస్తామ‌ని చంద్ర‌బాబు ఆనాడు తెలిపారు. 2017 జ‌న‌వ‌రిలో దావోస్ వెళ్లారు. సాంకేతిక ప్ర‌గ‌తికి మైక్రోసాఫ్ట్ స‌హ‌కారం తీసుకుంటామ‌ని అన్నారు. ఫిన్‌టెక్ వ్యాలీలా ఏపీ త‌యారు చేస్తామ‌ని చంద్ర‌బాబు అన్నారు. 2017 అక్టోబ‌రులో లండ‌న్ వెళ్లిన‌ప్పుడు రాష్ట్రానికి ఏరో సిటీ, న‌లంద యూనివర్శిటీ, ఆర్గానిక్ పుడ్ ఇండ‌స్ట్రీ తెస్తామ‌ని అన్నారు. దుబాయ్ వెళ్లిన‌ప్పుడు ఎమిరేట్స్ సంస్థ‌కు హ‌బ్‌గా ఏపీని తీర్చిదిద్దుతాం అని ప్ర‌క‌టించారు.  2017 డిసెంబ‌రులో ద‌క్షిణ కొరియాకు వెళ్లి ఏపీ రెండో రాజ‌ధాని అని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అనంత‌లో ఫ్రెండ్లీ కాంప్లెక్స్‌, కొరియా సిటీ తెస్తామ‌ని మొత్తం 3వేల కోట్లు అని ప్ర‌క‌టించారు. 2018 జ‌న‌వ‌రిలో దావోస్ వెళ్లి పెట్టుబ‌డులు పెట్ట‌మ‌ని విజ్ఞ‌ప్తి చేశారు. త‌ర్వాత దుబాయ్‌లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న చేశారు. ఫోనిక్స్ ఆధ్వ‌ర్యంలో అతిపెద్ద రైస్ మిల్లు వ‌స్తోంద‌ని అన్నారు. ఇలా చంద్ర‌బాబు విదేశాల్లో ప‌ర్య‌టించారు. వీటి కోసం 39 కోట్లు ఖ‌ర్చు చేశార’’న్నారు.

స్కూళ్ల ముఖచిత్రాలను మార్చి చూపిస్తాం : ఆదిమూలపు సురేష్‌
రెండేళ్లలో ఏపీలోని స్కూళ్ల ముఖచిత్రాలను మార్చి చూపిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. స్కూళ్లలో బయో టాయిలెట్లపై కూడా ఆలోచిస్తున్నామన్నారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ స్కూళ్ల మేనేజ్‌మెంట్‌ కమిటీలను గత ప్రభుత్వం రాజకీయం చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో మౌళిక సదుపాయాలు కల్పించలేదు. టీడీపీ ప్రభుత్వం టెండర్లపైనే దృష్టి పెట్టింది. 25వేల స్కూళ్లలో ప్రహారీ గోడలు లేవు. పారిశుద్ధ్య కార్మికులకు గత ప్రభుత్వం జీతాలివ్వలేదు. రేషనలైజేషన్‌తో మూతపడ్డ స్కూళ్లను తిరిగి తెరిపిస్తాం. అన్ని స్కూళ్లలో మౌళిక సదుపాయాలు కల్పిస్తాం. స్కూళ్లలో కనీస సౌకర్యాలు కల్పించడానికి రూ. 1500 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్ల కోసం రూ.160కోట్లు కేటాయించామ’’ని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement