17 వరకు అసెంబ్లీ సమావేశాలు  | AP Assembly Sessions up to 17 | Sakshi
Sakshi News home page

17 వరకు అసెంబ్లీ సమావేశాలు 

Published Tue, Dec 10 2019 4:28 AM | Last Updated on Tue, Dec 10 2019 10:46 AM

AP Assembly Sessions up to 17 - Sakshi

బీఏసీ సమావేశంలో స్పీకర్‌ తమ్మినేని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, టీడీపీ నేత అచ్చెన్నాయుడు, మంత్రులు

సాక్షి, అమరావతి: శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలను ఏడు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ (సభా వ్యవహారాల సలహా కమిటీ) సమావేశాల్లో నిర్ణయించారు. సోమవారం ప్రారంభమైన ఉభయ సభల సమావేశాలు ఈనెల 17వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 14, 15వ తేదీల్లో సభా కార్యక్రమాలకు సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. స్పీకర్‌ తమ్మినేని సీతారామ్, మండలి చైర్మన్‌ ఎం.ఏ.షరీఫ్‌ అధ్యక్షతన బీఏసీ సోమవారం విడివిడిగా సమావేశమైంది. శాసనసభ బీఏసీకి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మంత్రులు పి.అనిల్‌కుమార్‌ యాదవ్, కె.కన్నబాబు, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డితోపాటు టీడీపీ నుంచి ఉపనేత కె.అచ్చెన్నాయుడు హాజరయ్యారు. శాసనమండలి బీఏసీకి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, బీజేపీ ఎమ్మెల్సీ పి.మాధవ్, పీడీఎఫ్‌ తరపున బాలసుబ్రమణ్యం హాజరయ్యారు. 

సదా సిద్ధం: గడికోట
వైఎస్సార్‌సీపీ తరపున 20 అంశాలను సభలో చర్చ కోసం ప్రతిపాదించినట్లు  సమావేశం అనంతరం గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాకు తెలిపారు. నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, రైతు భరోసా – రైతు సమస్యలు, అవినీతి రహిత పాలన, రివర్స్‌ టెండరింగ్, విద్యుత్‌ పీపీఏలు, ఆర్టీసీ విలీనం, గృహ నిర్మాణం,  విభజన హామీలు, పోలవరం, రాజధాని అంశాలు, మద్యం పాలసీ, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించాలని కోరుతున్నామన్నారు. ప్రజా ప్రాధాన్యం కలిగిన ఏ అంశాన్నైనా సరైన విధానంలో ప్రస్తావిస్తే చర్చకు అధికారపక్షం సిద్ధమేనని, దేనికీ వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఆర్థిక సంఘం సభ్యులు 18వతేదీ నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నందున సమావేశాలను 17 వరకే కుదించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కాగా టీడీపీ తరపున సమావేశాలను 15 రోజుల పాటు జరపాలని సూచించారు.

మండలిలో 6 అంశాలపై ఏకాభిప్రాయం
శాసన మండలి సమావేశాల్లో ఇసుక కొరత, రాజధాని సంబంధిత అంశాలు, పోలవరం, మద్యం పాలసీ, శాంతి భద్రతలు, మాతృభాష – ఆంగ్లంలో విద్యాబోధనపై చర్చించాలని ఏకాభిప్రాయం కుదిరింది. వాయిదా తీర్మానాలను ప్రశ్నోత్తరాలకు ముందే చేపట్టాలన్న యనమల సూచనతో ఉమ్మారెడ్డి విబేధించారు. ప్రశ్నోత్తరాల తరువాతే వాయిదా తీర్మానాలు చేపట్టాలనే విధానం గతంలో టీడీపీ నెలకొల్పిన పద్ధతేనని బీఏసీ దృష్టికి తెచ్చారు. 

అచ్చెన్నకు జగన్‌ పరామర్శ
శాసనసభ బీఏసీ సమావేశానికి హాజరైన టీడీపీ నేత అచ్చెన్నాయుడును అజెండా ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి జగన్‌ పరామర్శించారు. ఇటీవల అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ‘ఇప్పుడెలా ఉన్నారు? అంతా బాగుంది కదా?’ అని సీఎం వాకబు చేశారు. ప్రమాదం జరిగిన తీరును అచ్చెన్న వివరిస్తూ చిన్న గాయమేనని, నయమైందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement