విపక్షం సభలో లేకపోయినా అదే తీరు
అడ్డూ అదుపూ లేకుండాఅధికార పార్టీ సభ్యుల ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయనందుకు నిరసనగా ప్రతిపక్షం అసెంబ్లీని బహిష్కరించడంతో సభ సోమవారం నిస్సారంగా జరిగింది. ఏకపక్షంగా సాగిన సభలో అధికార పక్ష సభ్యులకు మైకు అడిగిన వాళ్లకు అడిగినట్టుగా అందింది. ఎప్పటిలాగే విపక్షంపై అడ్డూఅదుపూ లేకుండా విమర్శలు, ఆరోపణలతో సుదీర్ఘ ప్రసంగాలు కొనసాగాయి. మామూలు పరిస్థితుల్లో గంట సేపట్లో ముగిసే ప్రశ్నోత్తరాల సమయం రెండు గంటలకు పైగా సాగింది. ఆ తర్వాత జీరో అవర్ నడిచింది. ఆ వెంటనే కమిటీల నివేదికలను ప్రవేశపెట్టిన అనంతరం 11.22 గంటల సమయంలో స్పీకర్ కోడెల సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. గంట తర్వాత 12.25 ప్రాంతంలో సభ ప్రారంభమైనా ఏకపక్ష ఉపన్యాసాలు అవధులు లేకుండా కొనసాగాయి.
2016-17 ఆర్థిక సంవత్సరానికి పలువురు మంత్రులు ప్రవేశపెట్టిన పద్దులపై చర్చ పేరిట సుదీర్ఘ ప్రసంగాలు సాగాయి. విద్యుత్ పరిస్థితిపై ప్రవేశపెట్టిన కట్ మోషన్ (పద్దుల్లో కోతకు సంబంధించిన తీర్మానం)పై చర్చను ప్రారంభించిన టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిపై, అలాగే విపక్ష నేత వైఎస్ జగన్ పై పలు ఆరోపణలు చేశారు. సభలో లేని వ్యక్తులపై విమర్శలు గానీ, వారి గురించిన ప్రస్తావనలు గానీ తేకూడదన్న నిబంధనను మరిచి ఆయన 40 నిమిషాలకు పైగా చేసిన ప్రసంగం వినలేక పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సభ నుంచి నిష్ర్కమించడం గమనార్హం. ఇదే సమయంలో చంద్రబాబును కీర్తించడానికి.. ఎన్ని పదాలున్నాయో అన్నింటినీ ఆనందబాబు ఉపయోగించారు.
ఆ తర్వాత వ్యవసాయంపై ప్రసంగించిన రామానాయుడు, ఆలపాటి రాజా సైతం తామేమీ తక్కువ తినలేదంటూ విపక్షంపై విమర్శలు, స్వపక్షంపై ప్రశంసల వర్షం కురిపించారు. విద్యుత్ రంగాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వీర్యం చేశారని ఒకరంటే, మొత్తం నీటిపారుదల రంగాన్నే ఎందుకూ కొరగాకుండా చేశారని ఇంకొకరు ఆరోపించారు. విపక్షం లేకపోవడం వల్ల సభ చక్కగా సాగుతోందని మరో ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. తమ పార్టీ సభ్యులందరూ మంత్రులకు చక్కని సలహాలు.. సూచనలు ఇచ్చారని, తాము ఇలాంటి సభను కోరుకుంటున్నామని మరికొందరు అన్నారు.