సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యకలాపాల వ్యవహారాల సలహామండలి (బీఏసీ) సమావేశం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన బుధవారం జరిగింది. స్పీకర్ ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, సభా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభా సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకూ జరపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. శని, ఆదివారం మినహా మొత్తం 14 పనిదినాలు పాటు శాసనసభ జరగనుంది. ఈ సమావేశం ముగిసిన తరువాత శాసనమండలి సభా కార్యకలాపాల సలహామండలి సమావేశం చైర్మన్ ఎంఏ షరీఫ్ ఛాంబర్‌లో జరుగుతుంది.
సాయంత‍్రం 4 గంటలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేస్తారు. కాగా శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి (గురువారం) ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొలిసారిగా శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు 2019–20 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీకి సమర్పిస్తారు. శాసనమండలిలో సభా నాయకుడు, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. శాసన మండలిలో పశు సంవర్థక, మత్య్స శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment