సాక్షి, అమరావతి : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల దశాబ్దల కల సాకారం కానుంది. బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశం అనంతరం రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్టు వెల్లడించారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్టు చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నియమ నిబంధనలు.. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తిస్తాయన్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచుతున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 330 కోట్ల ఆర్థిక భారం పడనుందని.. దానిని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. బస్సు చార్జీల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
కొత్త ఇసుక పాలసీకి కేబినెట్ ఆమోదం..
అలాగే కొత్త ఇసుక పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. రీచ్‌ల దగ్గర టన్ను ఇసుక ధరను రూ. 375గా నిర్ణయించినట్టు తెలిపారు. ఇసుక రవాణా చార్జీ కిలోమీటర్‌కు రూ. 4.90గా ఉండనున్నట్టు చెప్పారు. మాఫియాకు తావులేకుండా ప్రజలకు నేరుగా ఇసుక సరఫరా జరగనుందన్నారు. అక్టోబర్ చివరి నాటికి మరిన్ని స్టాక్ పాయింట్లు పెంచుతామన్నారు. ఇకపై అవినీతికి ఆస్కారం లేకుండా ఇసుక సరఫరా జరగనుందని.. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు. జీపీఎస్ అమర్చిన వాహనాల ద్వారానే ఇసుక తరలింపు చేపడతామని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణాపై నిషేధం విధిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.
శ్రీరామనవమి నుంచి వైఎస్సార్ పెళ్లి కానుక..
వైఎస్సార్ పెళ్లి కానుకకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. వచ్చే శ్రీరామనవమి నుంచి వైఎస్సార్ పెళ్లి కానుక అమల్లోకి వస్తుందన్నారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు అందజేయనున్నట్టు తెలిపారు. దివ్యాంగులకు రూ. 1.5 లక్షలు అందించనున్నట్టు పేర్కొన్నారు. బీసీలకు వైఎస్సార్ పెళ్లి కానుక కింద రూ. 50 వేలు ఇవ్వనున్నట్టు చెప్పారు.
హోదా ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపైపై కేసుల ఎత్తివేతకు కేబినేట్ ఆమోదం తెలిపింది. హోదా ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. అలాగే ఆంధ్రాబ్యాంకు పేరును యథావిథిగా కొనసాగించాలని కేంద్రానికి లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. క్రీడాకారులకు ప్రోత్సహకాలు అందజేస్తామని స్పష్టం చేశారు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధుకు కేబినెట్ అభినందలు తెలిపిందన్నారు. టీడీపీ బోర్డు సభ్యుల సంఖ్యను 25కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. త్వరలోనే టీటీడీ బోర్డు కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
ఆశా వర్కర్ల వేతనాల పెంపుకు కేబినెట్ ఆమోదం..
ఆశా వర్కర్ల వేతనం పెంపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఆశా వర్కర్ల వేతనం రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంపు నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఆటోవాలాలు, ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 4లక్షల మంది ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment