సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై అధ్యయనానికి ఏర్పాటైన హై పవర్ కమిటీ రెండో భేటీ ముగిసింది. పాలన వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాలతో పాటు పలు కీలక అంశాలపై కమిటీ చర్చించింది. సుమారు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. అలాగే ఈ నెల 13వ తేదీన కమిటీ మరోసారి సమావేశం కానుంది. సమావేశం అనంతరం మంత్రులు పేర్ని నాని, కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు ప్రజలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికపై క్షుణ్ణంగా చర్చించామన్నారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను కమిటీ పరిశీలిస్తోందని, తప్పకుండా రైతుల ప్రయోజనాలను కాపాడతామని తెలిపారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకూడదని అభిప్రాయపడ్డారు. ఒకేచోట అభివృద్ధితో ఎంత నష్టపోయామో చరిత్ర చెబుతోందన్నారు. 13 జిల్లాల్లో అభివృద్ధి సమాంతరంగా జరగాలని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
ఇది గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదు..
కొద్ది రోజుల నుంచి టీడీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు తనదైన శైలిలో డ్రామాకు తెర తీశారు. రైతుల్లో లేనిపోని అపోహలతో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. అమరావతిలో భూ దందాను నడిపి ఆయన లబ్ది పొందాలని చూస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చంద్రబాబుకు పట్టదా? వెనుకబడిన ప్రాంతాలు అలానే ఉండాలా? కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు. జోలె పట్టుకొని తిరగడానికి చంద్రబాబుకు సిగ్గులేదా? ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి. ఇది గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆయన హామీ ఇచ్చారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా...
మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, స్వలాభం కోసమే చంద్రబాబు తాపత్రాయపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న ముఖ‍్యమంత్రిపై విమర్శలు చేయడం మంచిదికాదని సూచించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా ముందుకు వెళతాం అని ఆయన స్పష్టం చేశారు.
చదవండి:
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం
బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు
ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..
జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు
రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం
అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్
Comments
Please login to add a commentAdd a comment