
'రాజధాని'పై జులై 27న మధ్యంతర ఉత్తర్వులు!
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ వివాదం తాజాగా జాతీయ పర్యావరణ ట్రబ్యునల్కు ముందుకు వచ్చింది. ఏపీ రాజధానిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో బుధవారం విచారణ జరిగింది. పంట భూముల్లో రాజధాని నిర్మాణం వల్ల ఆహార భద్రతకు ముప్పు కలుగుతుందని, కృష్ణా పరివాహక ప్రాంతంలో రాజధాని పర్యావరణానికి నష్టం కలుగుతుందని శ్రీమన్నారాయణ అనే వ్యక్తి తన పిటిషన్లో పేర్కొన్నారు.
పర్యావరణ ప్రభావంపై అధ్యయనం చేయకుండా రాజధాని నిర్మించకూడదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. తక్షణమే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు 15 నిమిషాల పాటు వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. కాగా ఈ కేసుపై న్యాయస్థానం జులై 27న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది గంగూలీ.. కోర్టుకు హాజరయ్యారు.