జూన్ 1న ప్రజల ముందుకు రాజధాని మాస్టర్‌ప్లాన్
- నోటిఫికేషన్ జారీ చేయనున్న ప్రభుత్వం
- అభ్యంతరాల స్వీకరణకు నెల గడువు
- అనంతరం జూలైలో తుది నోటిఫికేషన్
హైదరాబాద్: నూతన రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ ఒకటిన ప్రజల ముందుకు తేనుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు ప్రతిపాదించారన్న అంశాలపై ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నందున ఆరోజు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ (ఐఈ-సింగపూర్)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా ఆ సంస్థ ఆ బాధ్యతను జురాంగ్, సుర్బానా అనే రెండు సంస్థలకు అప్పగించిన విషయం తెలిసిందే.
ఆ సంస్థలు తయారు చేసిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్‌ను ఇప్పటికే ప్రభుత్వానికి అందించగా, కీలకమైనమరో రెండు ప్రణాళికలను ఈ నెలాఖరులోగా అందించనున్నాయి. ఆ ప్రణాళికల మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, ఇతరత్రా ప్రతిపాదిత ప్రాజెక్టులు ఎక్కడెక్కడ చేపట్టాలని ఖరారు చేశారో వాటన్నింటినీ ప్రజల ముందు పెట్టాల్సి ఉంటుంది. ప్రతిపాదిత నిర్మాణాలపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు కనీసంగా నెల రోజుల పాటు గడువు ఇవ్వనున్నట్టు తెలిసింది.
ఆ గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుంది. ఆయా నిర్మాణాలపై ప్రభుత్వం ఇప్పటికే అంతర్గతంగా ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో అభ్యంతరాలను తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. తుది ప్రణాళికను జూలై మరో నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం తెలియజేయనుంది. ఆ తరువాత ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదని ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు.
దసరా నుంచే రాజధాని పనులు..
కోర్ కేపిటల్ సిటీ మాస్టర్ ప్రణాళికను మాత్రం వచ్చే నెల రెండో వారంలో సింగపూర్ సంస్థలు ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు సమాచారం. కోర్ కేపిటల్ సిటీ విస్తీర్ణాన్ని మరింతగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఈ ప్రణాళిక అందించడానికి సింగపూర్ సంస్థలు మరికొంత సమయాన్ని కోరినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా వచ్చే నెల 6న రాజధాని నిర్మాణానికి పునాదిరాయి మాత్రమే వేస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అసలు పనులు మాత్రం దసరా నుంచి ప్రారంభవుతాయని తెలిపాయి.