![AP is the center of innovative innovations - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/8/CBN.jpg.webp?itok=PYymnQZv)
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/చీరాల: విద్యార్థులు లక్ష్యాన్ని ఛేదించి ఉన్నతస్థాయికి చేరుకుని ఆంధ్రప్రదేశ్‌ను వినూత్న ఆవిష్కరణల కేంద్రంగా ఆవిష్కరింపజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా పామూరు మండలం దూబగుంట వద్ద ఆయన అబ్దుల్ కలాం ట్రిపుల్ ఐటీ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని చదివితే సాధించలేనిది లేదన్నారు. ఆర్థికలోటు ఉన్నా విద్యా రంగానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ట్రిపుల్ ఐటీతో పశ్చిమ ప్రకాశం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అయిదు ట్రిపుల్ ఐటీలు నడుస్తున్నాయన్నారు. నాదెళ్ల సత్య, రాజారెడ్డిలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
చేనేతల అభివృద్ధికి ప్రాధాన్యం ..: చేనేతల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జరిగిన చేనేత దినోత్సవ సభలో మాట్లాడారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా పందిళ్లపల్లిలో మగ్గాలు, చేనేత వస్త్రాల డిజైన్లు, రంగులు, రసాయనాల అద్దకం, అల్లు, రాట్నం పరిశీలించారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో భాగంగా యువతీ, యువకులతో నిరుద్యోగ భృతి ప్రకటనపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. చేనేత కార్మికులు, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సీఎం సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment