బాబు ఆస్తి తగ్గింది
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
కోడలు బ్రహ్మణి ఆస్తులు పెరిగాయి
అక్టోబర్ 2 నుంచి జన్మభూమి-మా ఊరు
నెల 22న నయూ రాయపూర్ పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్కలు ఎంత పచ్చి అబద్ధాలో చెప్పటానికి ఒకే ఒక్క ఉదాహరణ చాలు. తన కుటుంబానికి హెరిటేజ్ ఫుడ్స్‌లో 40 శాతం వాటా ఉందని బాబు శుక్రవారమూ చెప్పారు. అది స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీ కాబట్టి దాని విలువను బాబు దాచినా దాగదు. శుక్రవారంనాడు దాని షేరు ధర రూ.349. ఆ ధర దగ్గర దాని మార్కెట్ క్యాప్ విలువ రూ.810 కోట్లు. మరి అందులో 40 శాతమంటే ఎంత? 324 కోట్లు కాదా? మరి బాబు ఈ వాటాల విలువతో సహా తన కుటుంబానికున్న స్థిర, చరాస్తుల విలువంతా కలిపి రూ.39 కోట్లంటారేం? ఏటేటా తగ్గించుకుని పోతున్నారేం? ఎవరిని నమ్మించాలని? ఈయన మారేదెప్పుడు?
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన, కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించారు. గత ఏడాదితో పోల్చుకుంటే తనతో పాటు భార్య, కుమారుడి ఆస్తుల్లో పెద్దగా మార్పుల్లేవని, కోడలు బ్రహ్మణి ఆస్తులు పెరిగాయని చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నానని, వచ్చే ఏడాది నుంచీ తన కుమారుడు, కోడలు వారి ఆస్తులను స్వయంగా వెల్లడిస్తారని చెప్పారు. శుక్రవారం రాత్రి చంద్రబాబు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్తుల వివరాలు తెలియజేయడంతో పాటు ఇతర అంశాలపై మాట్లాడారు..
‘‘నా భార్య ఆస్తులు అన్నీ యధాతథంగా ఉన్నాయి. పీఎఫ్ మాత్రం రూ.1.08 కోట్లు పెరిగింది. బంగారం పెరిగింది. నికర ఆస్తులు తగ్గాయి. కుమారుడు లోకేష్ ఆస్తులు కూడా యధాతథంగా ఉన్నాయి. పీఎఫ్‌లో రూ.34 లక్షలు పెరిగారుు. వాహనాల సంఖ్య ఒకటి మేరకు పెరిగింది. నికర ఆస్తుల విలువ రూ.1.40 కోట్లు తగ్గింది. బ్రహ్మణి నికర ఆస్తి పెరిగింది. నిర్వాణ హోల్డింగ్స్ ఆస్తులు పెద్దగా పెరగలేదు. గతంలో రెండున్నర కోట్ల నష్టాల్లో ఉంటే ఈసారి రూ.90 లక్షల లాభాల్లోకి వచ్చింది. హెరిటేజ్ కంపెనీ టర్నోవర్ ఏడాదికి రూ.1,722 కోట్లు ఉంది. 22 సంవత్సరాల క్రితం నేను ప్రమోటర్‌గా ప్రారంభించిన కంపెనీ ఇప్పుడు ఇంత పెద్దస్థాయిలో ఉండటం గర్వంగా ఉంది. నా భార్య భువనేశ్వరితో పాటు మిగిలిన బృందం సమర్ధ నిర్వహణ వల్లే పలు అవార్డులు సాధించింది. మెంటర్‌గా దీనికి సంతోష పడుతున్నాను. కంపెనీ కోసం ములుగులో సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాం. క్రమశిక్షణ, నిబద్దత కోసమే ఆస్తులు ప్రకటిస్తున్నాను. ప్రతి రాజకీయ నేత ఆస్తులు ప్రకటించాలి.
మెట్రో వివాదాన్ని వాళ్లే పరిష్కరించుకోవాలి
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విషయంలో నాపై విమర్శలు రావటం బాధాకరం. ఎల్ అండ్ టీ అనే కంపెనీని నిపుణులు నిర్వహిస్తున్నారు. దానికి యజమాని ఉండరు. ఈ వివాదాన్ని తెలంగాణ ప్రభుత్వం, డెవలపర్ పరిష్కరించుకోవాలి. అయితే ఈ సమస్యను ఆ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో నేను మాట్లాడను. హైదరాబాద్‌కు మెట్రో రైల్‌ను కేటాయించింది నేను సీఎంగా ఉన్న సమయంలోనే.
హామీలన్నీ అమలు చేస్తా
హామీల అమలు, పరిపాలన తదితరాల గురించి కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, ఇతర పార్టీల నుంచి టీడీపీ నేర్చుకోవాల్సిన పనిలేదు. వీరు ఆతృత పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తీరు చూసి ప్రజలు బుద్ధి చెప్పారు. భూస్థాపితం చేశారు. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన హమీలను ప్రజలు అసహ్యించుకుని టీడీపికి అధికారం కట్టబెట్టారు. వారికి మాట్లాడే అధికారం లేదు. ఇబ్బందులున్నా, ఆర్ధిక వనరులు లేకున్నా ఇచ్చిన హామీలన్నింటినీ ఒక దాని తరువాత ఒకటి అమలు చేస్తాను. అక్టోబర్ 2 నుంచి జన్మభూమి-మా ఊరు కార్యక్రమం చేపడుతున్నాం. దీపావళి వరకూ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇదే సమయంలో సామాజిక పింఛన్లు అందచే జేస్తాం.
సాధ్యమైనంత త్వరగా విజయవాడకు..
అఖిల భారత సర్వీసు అధికారులు, రాష్ర్ట అధికారుల కేటాయింపు ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్ర ఆదాయం తేలాలి. సమస్యలున్నా రానున్న రోజుల్లో మంచి జరుగుతుంది. ఇప్పటికే పలు కంపెనీలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. విద్యుత్ కోసం రూ.85 వేల కోట్ల నుంచి లక్ష కోట్లు పెట్టుబడులు పెడుతున్నాం. విజయవాడలో స్థలాలు చూస్తున్నాం. అది పూర్తైన తరువాత వేటిని అక్కడకు తరలించగలమో వాటిని తరలిస్తాం. సాధ్యమైనంత త్వరగా అక్కడకు వెళతాం. సోమవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ పర్యటనకు వెళుతున్నా. ఒకరోజంతా అక్కడ ఉండి ఆ రాష్ర్ట నూతన రాజధాని నయా రాయపూర్‌ను పరిశీలించటంతో పాటు పోలవరం, ఇతర సమస్యలపై ఆ రాష్ట్ర సీఎంతో చర్చిస్తా. ఎర్రచందనం స్మగ్లర్లు ఒక వ్యవస్థలా తయారయ్యారు. వారిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం వేలం వేద్దామన్నా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.’’
చంద్రబాబే ఆయన ఆస్తులపై విచారణ కోరొచ్చుగా..! : అంబటి
ఏపీ సీఎం బాబు తన ఆస్తులపై ఏటా కల్లబొల్లి ప్రకటనలు చేసే బదులు ఆయనే చట్టబద్ధ సంస్థల తో విచారణ కొరచ్చు కదా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సలహా ఇచ్చింది. బాబుకు నిజాయితీ ఉం టే దర్యాప్తునకు ముందుకు రావాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. హెరిటేజ్ కంపెనీలో వందల కోట్ల ఆస్తులు, బాలాయపల్లి భూములు, హైటెక్ సిటీ పరిసరాల్లో ఫాంహౌస్, హైదరాబాద్‌లో ఆయన తనయుడి పేరు మీద ఉన్న ఇల్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో, మహా రాష్ట్ర, తమిళనాడుతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులు, సంపద, నగలు, నగదు.. బాబు రాజకీయాల్లో ప్రజాసేవ చేసుకుంటూ సంపాదిం చారంటే అంతకు మించి గిన్నిసు బుక్‌కు ఎక్కించాల్సిన అంశం ఉం టుందా అని ప్రశ్నించారు. ఏటా ఇలా ఆయన ఆస్తులం టూ ఆడిటింగ్ గానీ, చట్టబద్ధతగానీ లేకుండా తెల్ల కాగి తాల మీద అంకెలు వేసి, కనీసం సంతకం కూడా పెట్టకుండా ప్రకటన విడుదల చేయడమేమిటని ప్రశ్నిం చారు. దీనికి బదులు ఆయన స్వదేశీ, విదేశీ, బినామీ ఆస్తుల న్నింటి మీదా చట్టబద్ధమైన విచారణ కోరాలని అన్నారు.
.