సాక్షి, తిరుపతి : ‘పదిహేనేళ్ల కిందట నా భార్య ప్రతి సంక్రాంతికి ఊరెళదామని పట్టుబట్టింది. అందుకు ఆమెకు కృతజ్ఞతలు. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాలన్నీ ఖాళీ అయ్యాయి. ఇప్పుడు పల్లెలకు వెళ్లటం ఫ్యాషన్‌గా మారింది. ప్రతి ఒక్కరూ గ్రామాల్లో ఉండే అలవాటు చేసుకోవాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రతి ఒక్కరూ పల్లెలకు వచ్చేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. సంక్రాంతి సందర్భంగా కుటుంబసభ్యులతో కలసి నారావారిపల్లె వచ్చిన ఆయన మంగళవారమిక్కడ పుదిపట్ల నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే స్వగ్రామంలో 30 పడకల ప్రభుత్వాస్పత్రిని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సిమెంట్ రోడ్ల వల్ల మోకాళ్ల నొప్పులొచ్చే ప్రమాదం ఉందని.. అందుకే మట్టిరోడ్లు కూడా అవసరమన్నారు. నారావారిపల్లెలో ఓల్డేజ్ హోంతో పాటు ఆస్పత్రి వద్ద మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడి ఆస్పత్రిని స్విమ్స్‌తో అనుసంధానిస్తామని తెలిపారు. జీఏఎస్, జీపీఎస్ కింద ఉన్న నివాసాలన్నింటినీ మ్యాపింగ్ చేస్తామని సీఎం వెల్లడించారు. వాటి ద్వారా నివాస స్థలాలు, పక్కాగృహాలు లేని వారిని గుర్తించి గ్రామాల్లో 1+3 భవనాలు నిర్మించి ఇస్తామన్నారు. మామిడి ఎక్కువ సాగు చేస్తే ధరలు పడిపోయే అవకాశముందన్నారు. యానిమల్ హాస్టల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
పది రోజుల్లో హంద్రీ–నీవా పూర్తి చేసి నీళ్లిస్తా..
హంద్రీ–నీవా కాలువ పనులు పది రోజుల్లో పూర్తి చేసి మదనపల్లికి నీళ్లిస్తామని సీఎం చెప్పారు. ఆ తర్వాత పుంగనూరు, కుప్పం, పలమనేరు, చంద్రగిరి తదితర ప్రాంతాలకు నీళ్లు ఇస్తామన్నారు. చిత్తూరును కరువు రహిత జిల్లాగా మారుస్తామని ప్రకటించారు. శ్రీ సిటీ కారణంగా అనేక పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. త్వరలో టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.
ట్రాఫిక్ ఆంక్షలతో సీఎంపై సామాన్యుడి ఫైర్
చంద్రగిరి: ‘మీరు పండుగ చేసుకుంటే సరిపోతుందా.. మరి మా సంగతేంటి?’ అంటూ సీఎం చంద్రబాబుపై ఓ సామాన్యుడు ఫైర్ అయ్యాడు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇష్టారీతిన ట్రాఫిక్ ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంగళవారం ఉదయం 9.45 నుంచి సుమారు మూడు గంటల పాటు రంగంపేట నుంచి నారావారిపల్లి మీదుగా కొత్తపేటకు వెళ్లే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో వాహనాదారులు, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సహనం కోల్పోయిన పలువురు వాహనాదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా, పులిచెర్ల మండలం కొత్తపేటకు చెందిన ఓ ప్రయాణికుడు మాత్రం నేరుగా సీఎం బస వద్దకు వెళ్లి ఆయనపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ప్రజల నుంచి అర్జీలు తీసుకోవడమే కాదు.. వాహనాదారుల ఇక్కట్లు కూడా గమనించాలి’ అంటూ మండిపడ్డాడు. మీరు మాత్రమే పండుగ చేసుకుంటే సరిపోతుందా? మేము చేసుకోవద్దా..? అంటూ సీఎంను నిలదీశాడు.
Comments
Please login to add a commentAdd a comment