‘రాజధాని’కోసం నిధులు సమీకరించండి
నాలుగేళ్లలో రూ.32,500 కోట్ల ప్రాజెక్టులు చేపట్టాలి: సీఎం
సాక్షి, అమరావతి: రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను రుణాల రూపంలో వేగవంతంగా సమీకరించాలని అధికారులను సీఎం చంద్రబాబు కోరారు. ఇందుకోసం తక్కువ వడ్డీకి రుణాలిచ్చే అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. వచ్చే నాలుగేళ్లలో రూ.32,500 కోట్లతో మౌలిక వసతులు కల్పించాల్సిన ఉన్న నేపథ్యంలో రుణాల సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన రాజధాని వ్యవహారాలపై సీఆర్‌డీఏ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజధానిలో పదేళ్లలో సుమారు రూ.43 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించామని, ఇందులో అధిక భాగం వచ్చే నాలుగేళ్లలో వినియోగించాల్సివుందని చెప్పారు. 2018 నాటికి ఐదు విభాగాల్లో 21 ప్రాజెక్టులు ప్రారంభమయ్యేలా దృష్టి పెట్టామని వివరించారు.
‘టాప్‌టెన్’ విద్యాసంస్థలు అమరావతిలో ఏర్పాటయ్యేలా చూడండి..
దేశంలోని టాప్‌టెన్ విద్యాసంస్థలు, అంతర్జాతీయ విద్యాసంస్థలను అమరావతిలో నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. కార్పొరేట్ ఆస్పత్రులు, పరిశ్రమలు, స్టార్ హోటళ్ల ఏర్పాటుతో అమరావతి సత్వరం అభివృద్ధి చెందుతుందన్నారు. 15 ఏళ్లలో అమరావతిని మెగాసిటీగా మలచాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్నిరంగాలూ వృద్ధి చెందేలా చూడాలన్నారు. కోర్ కేపిటల్‌లో ఉన్న భూముల్ని రాజధానికి తలమానికంగా నిలిచే సంస్థలకే కేటాయించాలన్నారు.
పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధికోసం రూ.ఐదువేల కోట్లతో ఏపీ పట్టణాభివృద్ధి నిధి(ఆంధ్రప్రదేశ్ అర్బన్ డెవలప్‌మెంట్ ఫండ్-ఏపీయూడీఎఫ్) పేరుతో ట్రస్టు ఏర్పాటుకు సీఎం చంద్రబాబుఆమోదం తెలిపారు. ఈ ట్రస్టు నిర్వహణకు ప్రత్యేకంగా ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అస్సెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్(ఏపీయూఐఏఎంఎల్) పేరుతో ఒక కంపెనీని నెలకొల్పాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన సవివర నివేదికను పురపాలక శాఖాధికారులు బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎంకు అందజేశారు.