లబ్బీపేట (విజయవాడ) : తాత్కాలిక సచివాలయ శంకుస్థాపనకు వెళుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కాన్వాయ్ ఒకరిని బలి తీసుకుంది. కాన్వాయ్‌లోని ఓ వాహనం సైకిల్‌పై వెళ్తున్న పోస్టల్ ఉద్యోగిని ఢీకొనడంతో.. రెండు రోజులపాటు అపస్మారక స్థితిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి శుక్రవారం మృతిచెందారు. పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబం సభ్యులు తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యనమలకుదురు గ్రామంలో నివసించే బందా నాగేంద్ర వరప్రసాద్(54) బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసులో పోస్టల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో సైకిల్‌పై డ్యూటీకి వెళ్తూ మహాత్మాగాంధీ రోడ్డు నుంచి రాజగోపాలాచారి రోడ్డులోకి మలుపు తిరుగుతుండగా తాత్కాలిక రాజధాని శంకుస్థాపనకు వెళుతున్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలతో వరప్రసాద్ అపస్మారకస్థితికి చేరుకోవడంతో సమీపంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చించి, ఆస్పత్రి నుంచి అతని వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చి వెళ్లిపోయారు.
రెండు రోజులుగా అపస్మారక స్థితిలోనే చికిత్స పొందుతున్న నాగేంద్రవరప్రసాద్ శుక్రవారం వేకువజామున మృతి చెందారు. కాగా నాగేంద్రవరప్రసాద్‌కు భార్య లక్ష్మీఅన్నపూర్ణ, కుమారుడు శ్రీరామ్ చక్రవర్తి, కుమార్తె శ్రీముఖి శ్యామల ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన పెద్దదిక్కును కోల్పోవడంతో ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. నాగేంద్రవరప్రసాద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పోస్టల్ ఉద్యోగుల సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
సీఎం కాన్వాయ్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి
Published Fri, Feb 19 2016 8:24 PM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM