సామాజిక, రాజకీయ  విప్లవం.. | AP CM YS Jagan Has Taken Sensational Decision Regarding Cabinet Expansion | Sakshi
Sakshi News home page

సామాజిక, రాజకీయ  విప్లవం..

Published Sat, Jun 8 2019 2:02 AM | Last Updated on Sat, Jun 8 2019 11:12 AM

AP CM YS Jagan Has Taken Sensational Decision Regarding Cabinet Expansion - Sakshi

విజయవాడలో గవర్నర్‌తో భేటీ అయిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి:  నవ్యాంధ్రప్రదేశ్‌లో రాజకీయ, సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. తరతరాల రాజకీయ వివక్షకు తెరదించేస్తూ బడుగు, బలహీనవర్గాలకు తన మంత్రివర్గంలో అగ్ర ప్రాధాన్యం కల్పించాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమిస్తున్నట్లు ప్రకటించి  రాజకీయ సంచలనం సృష్టించారు. తన మంత్రి మండలి ఏర్పాటులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దాదాపు 60 శాతం ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మహిళలకు సైతం పెద్దపీట వేశారు. తన మంత్రి మండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముందుగానే స్పష్టం చేశారు. తదనుగుణంగానే ఆయన తన మంత్రి మండలి ఉండేటట్టుగా నిర్ణయించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘బీసీ–ఇ’వర్గానికి చెందిన ముస్లిం మైనార్టీలతో కలిపి బీసీలకు అత్యధికంగా 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు ఒకటి చొప్పున మొత్తం మీద 14 మంత్రి పదవులు కేటాయించి అగ్ర ప్రాధాన్యం కల్పించారు.

రెడ్డి, కాపు సామాజిక వర్గాల నుంచి నలుగురు చొప్పున మంత్రి మండలిలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కమ్మ, క్షత్రియ, వైశ్య వర్గాల నుంచి ఒక్కొక్కరికి మంత్రులుగా స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కీలకమైన స్పీకర్‌ పదవిని బీసీ వర్గానికి, డిప్యూటీ స్పీకర్‌ పదవిని బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక ప్రాంతీయ సమతౌల్యం పాటిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంత్రివర్గ కూర్పులో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. ఈ విధంగా సామాజిక, ప్రాంతీయ సమతౌల్యం పాటిస్తూ జగన్‌ తన మంత్రివర్గానికి తుది రూపు ఇచ్చినట్లు పార్టీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రికార్డు మెజార్టీతో అఖండ విజయం సాధించి, అధికారాన్ని చేపట్టి దేశం దృష్టిని ఆకర్షించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గం కూర్పులోనూ తనదైన ముద్ర వేశారు.  
 
సామాజిక న్యాయానికి పెద్దపీట  
తన మంత్రి మండలి కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయానికి అగ్రప్రాధాన్యం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున మొత్తం మీద ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించనున్నట్లు ప్రకటించి రాజకీయ సంచలనం సృష్టించారు. ఎన్నికల ముందు ఏలూరులో నిర్వహించిన ‘బీసీ గర్జన’సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో పదవుల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం పదవులు కేటాయిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత ఆచరణలో చూపించారు. 25 మంత్రులతో పూర్తి మంత్రి మండలిని ఒకేసారి ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఆయన అందులో ఏకంగా 14 పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 60 శాతం మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించడం ద్వారా ఆయన సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు.

మొత్తం 25 మందితో తన మంత్రి మండలిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం ఖరారు చేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... జగన్‌ మంత్రివర్గంలో బీసీ వర్గానికి అగ్రస్థానం దక్కింది. ‘బీసీ–ఇ’వర్గానికి చెందిన ముస్లిం మైనార్టీతోపాటు బీసీలకు 8 మంత్రి పదవులు కేటాయించారు. తరువాత ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాపు, రెడ్డి సామాజి కవర్గాలకు చెరో నాలుగు మంత్రి పదవులు ఖరారు చేశారు. ఎస్టీ, కమ్మ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కోటి చొప్పున మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక బీసీల్లోనూ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం విశేషం. ధర్మాన కృష్ణదాస్‌( పోలినాటి వెలమ), బొత్స సత్యన్నారాయణ(తూర్పు కాపు), పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ (శెట్టి బలిజ), మోపిదేవి వెంకటరమణ (మత్స్యకార), అనిల్‌ కుమార్‌యాదవ్‌ (యాదవ), గుమ్మనూరు జయరాం (బోయ), మాలగుండ్ల శంకరనారాయణ(కురబ) సామాజిక వర్గాలతోపాటు బీసీ–ఇ కేటగిరికీ చెందిన షేక్‌ అంజాద్‌ బాషా(ముస్లిం మైనార్టీ)కి తన మంత్రి వర్గంలో స్థానం కల్పించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఎస్సీ సామాజికవర్గానికి ఏకంగా ఐదు మంత్రి పదవులను కేటాయించడం గమనార్హం. మాల సామాజికవర్గ నుంచి ముగ్గురు, మాదిగ సామాజికవర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు. మాల సామాజిక వర్గానికి చెందిన పినెపి విశ్వరూప్, మేకతోటి సుచరిత, కళత్తూరు నారాయణస్వామిలకు అవకాశం ఇవ్వగా... మాదిగ సామాజిక వర్గానికి చెందిన తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌లకు మంత్రులుగా స్థానం దక్కింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కాపు సామాజికవర్గం నుంచి ముత్తంశెట్టి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఆళ్ల శ్రీనివాస్‌(నాని), పేర్ని వెంకటరామయ్య(నాని)లకు మంత్రులుగా అవకాశం కల్పించారు. రెడ్డి సామాజికవర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నిర్ణయించారు. ఇక ఎస్టీ సామాజికవర్గం నుంచి పాముల పుష్ప శ్రీవాణి, కమ్మ సామాజికవర్గం నుంచి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), క్షత్రియ సామాజికవర్గం నుంచి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వైశ్య సామాజికవర్గం నుంచి వెలంపల్లి శ్రీనివాస్‌లకు మంత్రులుగా అవకాశం కల్పించారు.  
 
ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు  
తన మంత్రి మండలిలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాలకు ఒక్కో ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించడం ద్వారా సామాజిక న్యాయానికి జగన్‌ అత్యధిక ప్రాముఖ్యం ఇస్తున్నట్లు తేటతెల్లమవుతోంది. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించనున్నట్లు తాడేపల్లిలో శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్‌ఎల్పీ సమావేశంలో జగన్‌ ప్రకటించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. బడుగు, బలహీన వర్గాలకు మొక్కుబడిగా తక్కువ ప్రాధాన్యమున్న మంత్రి పదవులను ఇచ్చి సామాజిక న్యాయం చేశామని రాజకీయ పార్టీలు ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తుంటాయి. కానీ, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయం సాధన పట్ల తన చిత్తశుద్ధిని చేతల్లో చూపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాలకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయిస్తున్నట్లు ప్రకటించి జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ స్థాయిలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రులుగా ఎవరికి అవకాశం దక్కనుందన్నది శనివారం మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం వెల్లడిస్తారు.  
 
ప్రాంతీయ సమతౌల్యం  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన మంత్రి మండలిలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రాంతీయ సమతౌల్యం పాటించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఒకరు, విజయనగరం జిల్లా నుంచి ఇద్దరు, విశాఖపట్నం జిల్లా నుంచి ఒకరు చొప్పున ఉత్తరాంధ్రకు నాలుగు మంత్రి పదవులు కేటాయించారు. తూర్పు గోదావరిజిల్లా నుంచి ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముగ్గురు చొప్పున ఉభయగోదావరి జిల్లాలకు ఆరు మంత్రి పదవులు కేటాయించడం విశేషం. కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు, గుంటూరు జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం కల్పిస్తూ రాజధాని జిల్లాలకు ఐదు మంత్రి పదవులతో సముచిత గౌరవం ఇచ్చారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున నలుగురిని తన మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు, కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు, వైఎస్సార్‌ జిల్లా నుంచి ఒకరు, అనంతపురం జిల్లా నుంచి ఒకరు చొప్పున రాయలసీమ నుంచి ఆరుగురికి జగన్‌ తన మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించారు. తద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ మంత్రివర్గ కూర్పులో ప్రాంతీయ సమతౌల్యం పాటించడంపట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  
 
స్పీకర్‌ పదవి బీసీకి... డిప్యూటీ స్పీకర్‌ పదవి బ్రాహ్మణులకు!  
రాజ్యాంగపరంగా అత్యంత కీలకమైన శాసనసభ స్పీకర్‌ పదవిని బీసీకి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. అందులోనూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు స్పీకర్‌ పదవిని కేటాయించడం విశేషం. శ్రీకాకుళం జిల్లా అమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే, సీనియర్‌ నేత తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా నిర్ణయించినట్లు సమాచారం. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గతంలో 9 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న తమ్మినేని సీతారాం బీసీ వర్గానికి చెందిన కాళింగ సామాజిక వర్గం నేత. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా రాజకీయంగా సముచిత స్థానం కల్పించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్‌గా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

రఘుపతి గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ విధంగా మంత్రివర్గ కూర్పుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించారు. సామాజిక న్యాయానికి అగ్ర ప్రాధాన్యం కల్పిస్తూ ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా ప్రకటించడం... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు దాదాపు 60 శాతం మంత్రి పదవులు కేటాయిస్తూ మంత్రి మండలి ఏర్పాటుకు నిర్ణయం... స్పీకర్‌ పదవిని కూడా బీసీ వర్గానికి ఖరారు చేయడం... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ మంత్రివర్గ కూర్పుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయం పట్ల తన చిత్తశుద్ధిని... సుపరిపాలన పట్ల తన నిబద్ధతను చాటుకున్నారని పరిశీలకులు కొనియాడుతున్నారు.  
 
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేతలు  
1. ధర్మాన కృష్ణదాస్‌ (పోలినాటి వెలమ–బీసీ)– శ్రీకాకుళం 
2. బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు–బీసీ)– విజయనగరం  
3. పాముల పుష్పశ్రీవాణి (ఎస్టీ)– విజయనగరం  
4. అవంతి శ్రీనివాస్‌ (కాపు)–విశాఖపట్నం  
5. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ (శెట్టిబలిజ–బీసీ)– తూర్పు గోదావరి  
6. కురసాల కన్నబాబు (కాపు)– తూర్పు గోదావరి  
7. పినిపె విశ్వరూప్‌ (ఎస్సీ–మాల)– తూర్పు గోదావరి  
8. ఆళ్ల నాని (కాపు)– పశ్చిమ గోదావరి 
9. తానేటి వనిత (ఎస్సీ–మాదిగ)– పశ్చిమ గోదావరి  
10. చెరుకువాడ శ్రీరంగనాథరాజు(క్షత్రియ– పశ్చిమ గోదావరి 
11. వెల్లంపల్లి శ్రీనివాస్‌ (వైశ్య)– కృష్ణా  
12. కొడాలి నాని (కమ్మ)– కృష్ణా  
13. పేర్ని నాని (కాపు)– కృష్ణా  
14. మేకతోటి సుచరిత (ఎస్సీ–మాల)– గుంటూరు  
15. మోపిదేవి వెంకటరమణారావు (మత్స్యకారుడు–బీసీ)– గుంటూరు 
16.బాలినేని శ్రీనివాసరెడ్డి (రెడ్డి)– ప్రకాశం  
17. ఆదిమూలపు సురేష్‌ (ఎస్సీ–మాదిగ)– ప్రకాశం  
18.పాలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ (యాదవ–బీసీ)– పీఎస్సార్‌ నెల్లూరు 
19. మేకపాటి గౌతమ్‌రెడ్డి (రెడ్డి)– పీఎస్సార్‌ నెల్లూరు 
20. షేక్‌ బేపారి అంజాద్‌ బాషా(ముస్లిం–బీసీ)– వైఎస్సార్‌ జిల్లా  
21. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (రెడ్డి)– చిత్తూరు  
22. కళత్తూరు నారాయణస్వామి (ఎస్సీ–మాల)– చిత్తూరు  
23. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (రెడ్డి)– కర్నూలు  
24. గుమ్మనూరు జయరామ్‌ (బోయ–బీసీ)– కర్నూలు  
25. మాలగుండ్ల శంకరనారాయణ (కురుబ–బీసీ)– అనంతపురం    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement