సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వచ్ఛందంగా కోవిడ్-19 (కరోనా) పరీక్ష చేయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి తెప్పించిన రాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా ముఖ్యమంత్రికి శుక్రవారం వైద్యులు పరీక్ష చేశారు. ఈ పరీక్షలో నెగిటివ్‌గా నిర్థారణ అయింది. కాగా ఇవాళ ఉదయం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కిట్ ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ను వైద్యులు పరీక్షించారు. కోవిడ్ –19 నివారణా చర్యల కోసం ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా చార్టర్ విమానంలో దక్షిణ కొరియాలోని సియోల్ నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లను తెప్పించింది. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ ఈ కిట్లను ప్రారంభించారు. (ఏపీలో 10 నిమిషాల్లో కరోనా ఫలితం)
ర్యాపిడ్ కిట్లలో ఐజీజీ, ఐజీఎం రెండురకాలు స్ట్రిప్స్ ఉంటాయి. కేవలం బ్లడ్ డ్రాప్స్‌ను ఈ స్ట్రిప్స్‌పై వేస్తారు. తర్వాత కంట్రోల్ సొల్యూషన్ వేస్తారు. 10 నిమిషాల వ్యవధిలో వైరస్ ఉన్నదీ, లేనిదీ చూపిస్తుంది. దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌డీ బయోసెన్సార్ కంపెనీ వీటిని ఉత్పత్తి చేస్తోంది. అమెరికా, ఐరోపా లాంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఐసీఎంఆర్ ఇప్పటికే ఈ కిట్లకు ఆమోదం తెలిపింది. (కరోనా పరీక్షలు: నాలుగో స్థానంలో ఏపీ)
కరోనా వైరస్ పరిస్థితులకు ముందు రాష్ట్రంలో ఒకే ఒక్క వైరాలజీ ల్యాబ్ ఉండేది. మొదట్లో కేవలం ఈ ల్యాబ్‌నుంచే టెస్టులు చేయించేవారు. కోవిడ్ –19 నివారణా చర్యల్లో భాగంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికిన చర్యలు చేపట్టి. కేవలం 2 వారాల వ్యవధిలో విజయవాడ, కాకినాడ, అనంతపూర్, గుంటూరు, కడప, విశాఖపట్నంలో ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ ల్యాబ్‌ల ద్వారా 2100పైగా టెస్టులను రోజూ చేస్తున్నారు. ఇవికాకుండా రాష్ట్రంలో విస్తృతంగా ట్రూనాట్ కిట్లు ఉన్నాయి.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ట్రానాట్ కిట్లు ఉన్నాయి. సుమారు 240 పైగా కిట్లను ఉపయోగించుకోవడం వల్ల పరీక్షల సామర్థ్యం గణనీయంగా పెరిగింది. అందువల్లే ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వినియోగానికి ముందే దేశంలో జానాభా ప్రాతిపదికన అత్యధిక కోవిడ్ –19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 16వ తేదీ వరకూ 16,555 పరీక్షలను ప్రభుత్వం చేసింది. ప్రతి 10లక్షల మంది జనాభాకు రాజస్థాన్‌లో 549, కేరళ 485, మహారాష్ట్ర 446, ఆంధ్రప్రదేశ్‌లో 331 పరీక్షలు చేశారు. తర్వాత రాష్ట్రాలన్నీ తక్కువగానే ఉన్నాయి. (కుటుంబ సర్వే ఆధారంగా పరీక్షలు: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment