సాక్షి, అమరావతి: కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడికై భౌతిక దూరం పాటించేలా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అదే విధంగా మాస్కుల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ఆదేశాలు జారీచేశారు. ప్రతీ మనిషికి మూడు చొప్పున.. తొలుత హాట్‌స్పాట్లలో మాస్కులను పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో కోవిడ్ –19 నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.(కందుకూరి వీరేశలింగంకు సీఎం జగన్ నివాళి)
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... క్వారంటైన్‌లో సదుపాయాలపై నిరంతరం దృష్టిపెట్టాలని సూచించారు. అదే విధంగా వివిధ సెంటర్ల నుంచి క్వారంటైన్ పూర్తిచేసుకున్న వారిని ఇంటికి పంపేటప్పుడు బీదలకు రూ.2వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు. ‘‘ముందుజాగ్రత్త చర్యగా వారిని మనం క్వారంటైన్‌లో పెడుతున్నాం. ఒకేసారి మనం ఇంటికి పంపితే... పస్తు ఉండే పరిస్థితి ఉండకూడదు. అందుకే తిరిగి ఇంటికి పంపించినప్పుడు రూ. 2వేల డబ్బు చేతిలో పెట్టాలి. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో పాలు, గుడ్డు, కూరగాయలు తదితర పౌష్టికాహారం తీసుకోవాలని వారికి సూచనలు చేయాలి. లేదంటే.. మళ్లీ సమస్య మొదటికి వచ్చే ప్రమాదం ఉంటుంది’’అని హెచ్చరించారు.(ఏపీ: నేటి నుంచి ఉచిత రేషన్)
అదే విధంగా... లాక్‌డౌన్ అమలు అవుతున్న నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్న సీఎం జగన్... రైతు భరోసా, మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలని.. కియోస్క్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆర్బీకేలను కేంద్రంగా చేసుకుని మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతికి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని.. వినూత్న పద్ధతుల్లో ఆక్వా ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలో అమ్మడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment