అర్హుల జాబితాను తనిఖీ చేస్తా: సీఎం జగన్‌ | AP CM YS Jagan Video Conference On Spandana Program | Sakshi
Sakshi News home page

స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష

Published Tue, Jan 28 2020 12:50 PM | Last Updated on Tue, Jan 28 2020 4:57 PM

AP CM YS Jagan Video Conference On Spandana Program - Sakshi

సాక్షి, తాడేపల్లి:  కొత్త పెన్షన్లను ఫిబ్రవరి 1 నుంచి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఫిబ్రవరి 15 కల్లా ఇళ్ల పట్టాల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీచేశారు. తాను గ్రామాలకు వెళ్లినప్పుడు అర్హుల జాబితాను తనిఖీ చేస్తానని.. అర్హులైన వారికి స్థలం కేటాయించలేదనే విషయాన్ని గుర్తిస్తే ఉపేక్షించబోనని హెచ్చరించారు. స్పందన కార్యక్రమంపై మంగళవారం సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... ‘‘ఫిబ్రవరి 1 నుంచి ఫించన్ల డోర్ డెలివరీ ఉంటుంది. అదే విధంగా ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు కొత్త పెన్షన్, బియ్యం కార్డులు పంపిణీ చేయాలి. ఇందుకోసం గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలి. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలి. కాబట్టి ఇళ్ల పట్టాల లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలి. మార్చి 1 కల్లా ఇళ్ల స్థలాల కోసం భూములు సేకరించాలి. మార్చి15 కల్లా లాటరీలు పూర్తి చేయాలి’’అని ఆదేశించారు.

11 లక్షల మందికి విద్యా వసతి దీవెన
‘ఫిబ్రవరి 28న విద్యావసతి దీవెన ప్రారంభం అవుతుంది. దాదాపు 11 లక్షల మందికి విద్యావసతి దీవెన అందజేయనున్నాం. ఇక ఫిబ్రవరి 28న 3300 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించాలి. రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను శాశ్వతంగా గ్రామ సచివాలయాల్లో ఉంచాలి. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలు అందిస్తున్నాం.  336 సేవలు 72 గంటల్లో పూర్తిచేయాలి’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఆ డేటాతో చెక్‌ చేసుకోండి..
‘25 లక్షల మందికి మహిళల పేర్లమీద 10 రూపాయల స్టాంపు పేపర్లమీద ఇళ్లపట్టాలు. ప్రజాసాధికార సర్వేకూ.. ఇళ్లపట్టాల మంజూరుకు లింకు పెట్టకూడదు. ఎవరికైనా ఇళ్లు ఇచ్చి ఉంటే.. 2006 నుంచి ప్రభుత్వం వద్ద డేటా ఉంది. కేవలం ఆ డేటాతో మాత్రమే చెక్‌ చేసుకోవాలి. నేను గ్రామాల్లో పర్యటించేటప్పుడు.. మీ ఊరిలో ఇంటి స్థలం లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా? అని అడిగితే.. ఎవరు లేదని చెయ్యెత్తకూడదు. అలా జరిగితేనే కార్యక్రమం సవ్యంగా జరిగినట్లు. ఎవరి వల్ల కూడా అన్యాయం జరిగిందన్న మాట రాకూడదు. ఇళ్ల పట్టాలు ఇవ్వదలచుకున్న స్థలాలను ఖరారు చేసేముందు లబ్దిదారుల్లో మెజార్టీ ప్రజలు దీనికి అంగీకారం తెలపాలి. మొక్కుబడిగా ఇచ్చామంటే.. ఇచ్చినట్టుగా ఉంటే.. ఎవ్వరూ కూడా ఆ స్థలాల్లో ఉండటానికి ఇష్టపడరు. మనం ఇచ్చే ఇళ్లస్థలం వారి ముఖంలో సంతోషాన్ని నింపాలి. మన ఉద్దేశం నెరవేరాలి. ఆ స్థలాలు నివాసయోగ్యంగా ఉండాలి.

 ప్లాటింగ్‌ చేసేటప్పుడు.... ఈ అంశాలను కచ్చితంగా కలెక్టర్లు పరిశీలించాలి. ఊరికి చాలా దూరంలోనూ, నివాసానాకి ఉపయోగంలేని ప్రాంతాల్లో ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఫిబ్రవరి 15 కల్లా జాబితా సిద్ధం కావాలి. అభ్యంతరకర ప్రాంతాల్లో నివాసముంటున్నవారిపట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి. వారికి  ప్లాట్లను ఎక్కడ కేటాయిస్తున్న విషయాన్ని వారందరికీ చూపించాలి. వచ్చే ఏడాది నుంచి మనం చేపట్టబోయే నిర్మాణాల్లో మొదటి విడత ఇళ్ల నిర్మాణంలో వీరికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ఇళ్ల నిర్మాణం పూరైన తర్వాత మాత్రమే.. అభ్యంతరకర ప్రాంతాల్లో ఉన్నవారిని తరలించాలి. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం. మనకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు.. వారికి మంచి జరగాలి.

వైఎస్సార్‌ కంటి వెలుగు
ఫిబ్రవరి 1 నుంచి వైఎస్సార్‌ కంటి వెలుగు మూడో విడత చేపడుతున్నాం. అవ్వాతాతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గ్రామ స్థాయిలో స్క్రీనింగ్‌ చేయాలి. దాదాపు 1.25 కోట్ల మందికి స్క్రీనింగ్‌ చేయాలని నిర్ణయం. 
జులై 31 దాకా మూడో విడత కార్యక్రమం. ఫిబ్రవరి 15 నుంచి ఆరోగ్యకార్డులు జారీ. ఇప్పటివరకూ 66,15,467 మంది పిల్లలకు కంటి పరీక్షలు. లక్షన్నర మందికి కంటి అద్దాలు పంపిణీ కొనసాగుతోంది. 46వేల మందికి  శస్త్రచికిత్సలు కూడా చేశారు. ఫిబ్రవరిలో 4,906 కొత్త సబ్‌సెంటర్ల నిర్మాణానికి పనులు ప్రారంభం.

మధ్యాహ్న భోజనం
మధ్యాహ్న భోజనం నాణ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదు. కలెక్టర్లు స్కూళ్లకు వెళ్లి పరిశీలన చేయాలి. సెర్ప్‌లో ఆర్డీఓ స్థాయి అధికారి మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాలి. భోజనం క్వాలిటీని నిరంతరం పర్యవేక్షించడానికి మొబైల్‌ యాప్‌. స్కూళ్లలో బాత్‌రూమ్స్‌ నిర్వహణపైన కూడా దృష్టిపెట్టాలి. అంగన్‌వాడీలు, స్కూళ్లలో పరిస్థితులపై దృష్టి సారించాలి’ అని సీఎం జగన్‌ ఆదేశించారు.

ఇసుక డోర్‌ డెలివరీ
సమీక్ష సందర్భంగా... ‘జనవరి 10 నుంచి ఉభయ గోదావరి, కడప జిల్లాల్లో ఇసుక డోర్‌ డెలివరీ ప్రారంభమైంది. ఇప్పటివరకు 1,12,082 టన్నులు డోర్‌ డెలివరీ. 48-72 గంటల్లో ఇసుక డోర్‌ డెలివరీ. జనవరి 30న అనంతపూర్, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇసుక డోర్‌ డెలివరీ.. ఫిబ్రవరి 7 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో డోర్‌ డెలివరీ... ఫిబ్రవరి 14 నుంచి గుంటూరు, చిత్తూరు, కర్నూల్లో ఇసుక డోర్‌ డెలివరీ... ఇసుకను అధిక రేట్లకు అమ్ముకునే అవకాశం గాని, వినియోగదారులకు అధిక రేట్ల బెడద కాని లేదు. 389 చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు పెట్టాం. ఫిబ్రవరి 4 నాటికి అన్ని చెక్‌ పోస్టుల నుంచి ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది’ అని అధికారులు స్పష్టం చేశారు. 16.5 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉందని వెల్లడించారు. ఈ క్రమంలో వర్షాకాలం వచ్చే సరికి 60-70 లక్షల టన్నుల నిల్వ ఉంచాలని సీఎం సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement