ఉద్రిక్తత నడుమ ఎంసెట్ కౌన్సెలింగ్ | AP Eamcet Counselling Will Starts In High Tension | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తత నడుమ ఎంసెట్ కౌన్సెలింగ్

Published Thu, Aug 22 2013 2:08 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

AP Eamcet Counselling Will Starts In High Tension

ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం చేపట్టిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన.. తీవ్ర ఉద్రిక్తత నడుమ ఎట్టకేలకు ప్రారంభమైంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీలోని హెల్ప్‌లైన్ కేంద్రం వద్ద విద్యార్థి జేఏసీ నేతలు, సభ్యులు ఆందోళనకు దిగటంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీ పరిసరాల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి బయటనుంచి ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ర్యాంకర్‌తోపాటు ఒక్కరినే పంపారు. ఫలితంగా పరిస్థితి కొంత అదుపులో ఉన్నా విద్యార్థి జేఏసీ ఆందోళన కారణంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన సాగలేదు. వీసీ హెచ్.లజపతిరాయ్, ఏజేసీ ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డీఎస్పీ శ్రీని వాసరావు చర్చలు జరిపి నచ్చచెప్పటంతో జేఏసీ నాయకులు శాంతిం చారు. దీంతో మధ్యాహ్నం ర్యాం కర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంటన్నర వరకు కొనసాగింది.
 
 ఇదీ జరిగింది..
 సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పాలిటె క్నిక్ కళాశాల అధ్యాపకులు విధులు బహిష్కరించటంతో శ్రీకాకుళం పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలోని హెల్ప్‌లైన్ సెంటర్‌లో 19, 20 తేదీల్లో కౌన్సెలింగ్ జరగలేదు. దీంతో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని అంబేద్కర్ యూనివర్శిటీకి తరలించారు. అయితే వర్శిటీ విద్యార్థి జేఏసీ నాయకులు ఉదయం 8 గంటలకే హెల్ప్‌లైన్ కేంద్రానికి చేరుకున్నారు. ఐదేళ్లుగా వర్శిటీలో సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో ఇక్కడ కౌన్సెలింగ్ నిర్వహించటం ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధమని తేల్చి చెప్పారు. కౌన్సెలింగ్ కేంద్రం తెరిస్తే సహించేది లేదంటూ బైఠాయించారు.
 
 వీసీ, ఏజేసీ, డీఎస్పీ చర్చలు..
 విషయం తెలిసి ఏజేసీ రాజ్‌కుమార్, డీఎస్పీ శ్రీనివాసరావు, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.ఎస్.దత్‌లు వర్సిటీకి చేరుకున్నారు. వైస్‌చాన్సలర్ లజపతిరాయ్, రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్, ప్రిన్సిపాల్ మిర్యాల చంద్రయ్య, సీడీసీ డీన్ గుంట తులసీరావులతో చర్చిం చారు. విద్యార్థులను చెదరగొడతామని పోలీసు లు కోరినా వీసీ, అధికారులు అంగీకరించలేదు. విద్యార్థి జేఏసీ నాయకులు బడే రామారావు, కె.ధనరాజ్, పి.ప్రసాద్, బి.చక్రవర్తి తదితరులతో ఏజేసీ, వీసీ చర్చలు జరిపినా తొలుత అంగీకరించలేదు. ఎంతమంది పోలీసులు వచ్చినా వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఒక్కరోజు కౌన్సెలింగ్‌కు అవకాశం ఇవ్వాలని, గురువారం హెల్ప్‌లైన్ సెంటర్‌ను మారుస్తామని అధికారులు చెప్పారు. ప్రొఫెసర్లు కూడా సర్ది చెప్పటంతో విద్యార్థులు అంగీకరించారు. దీంతో మధ్యాహ్నం ఒంటిగంటకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభమైంది.
 
 నెట్‌తో పాట్లు.. అర్ధరాత్రి వరకు ప్రక్రియ
 షెడ్యూల్ ప్రకారం బుధవారం 30,001 నుంచి 45 వేల ర్యాంకులలోపు విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరుకావాలి. కానీ తొలి రెండు రోజులు ప్రక్రియ జరగకపోవటంతో 1 నుంచి 30 వేలలోపు ర్యాంకర్లు కూడా హాజరయ్యారు. మధ్యాహ్నం వరకు ప్రారంభం కాకపోవటంతో టోకెన్లు తీసుకున్న 495 మంది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు. వర్సిటీలో నెట్ నెమ్మదిగా ఉండటంతో రాత్రి 12 గంటల సమయానికి 290 మంది ధ్రువీకరణ పత్రాలనే పరిశీలించగలిగారు. దీంతో వీసీ లజపతిరాయ్ సూచన మేరకు అర్ధరాత్రి ఒంటిగంటన్నర వరకు ఈ ప్రక్రియను కొనసాగించారు.
 
 నేటి నుంచి శ్రీకాకుళం పాలిటెక్నిక్‌లోనే..
 గురువారం నుంచి శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ కేంద్రంలోనే కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తొలుత హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఎక్కడికి మార్చాలనేదానిపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. కలెక్టర్ కార్యాలయం, అంబేద్కర్ ఆడిటోరియాలను పరిశీలించారు. అయితే ఇంటర్నెట్ వసతి, ట్రాఫిక్ వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని పాలిటెక్నిక్ కళాశాలలోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని కలెక్టర్ సౌరభ్ గౌర్ సూచించారు. వాస్తవానికి వర్సిటీలో 2 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వ్యవస్థ ఉండటంతో కౌన్సెలింగ్ మందకొడిగా సాగింది. పాలిటెక్నిక్ కళాశాలలో 20 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వ్యవస్థ ఉంది. దీంతోపాటు హెల్ప్‌లైన్ సెంటర్ జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. అందువల్ల అక్కడే నిర్వహించాలని నిర్ణయించారు. పాలిటెక్నిక్ సిబ్బంది విధుల బహిష్కరణలో ఉండటంతో గురువారం కూడా యూనివర్సిటీ సిబ్బందే విధులు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement