విశాఖపట్నం (ఆంధ్రా యూనివర్సిటీ) : ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2015ను గురువారం(మే 14) నిర్వహించనున్నట్లు ఆంధ్రా యూనివర్సిటీ కన్వీనర్ ఆచార్య పీఆర్ భానుమూర్తి మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రీజనల్ సెంటర్లలోని 74 కేంద్రాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పరీక్షకు 39,248 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం ఆరు గంటలకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జేఎన్‌టీయూ (అనంతపురం)లో ప్రశ్నపత్రాల కోడ్‌ను విడుదల చేస్తారని వెల్లడించారు. ఉదయం 9.15 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. పరీక్షకు బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ మాత్రమే వాడాలని సూచించారు. క్యాలికులేటర్లు, సెల్‌ఫోన్‌లు, డిజిటల్ వాచీలను అనుమతించబోమన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
మే 21, 22 వ తేదీల్లో ఫలితాలు
ఏపీ ఈసెట్ రాత పరీక్ష ఫలితాలను ఈ నెల 21, 22 తేదీల్లో విడుదల చేయనున్నట్లు యూనివర్సిటీ కన్వీనర్ ఆచార్య పీఆర్ భానుమూర్తి తెలిపారు. 16న ప్రిలిమనరీ కీ, 20న ఫైనల్ కీని ఇస్తామన్నారు.
మే 14వ తేదీన ఏపీ ఈసెట్
Published Tue, May 12 2015 7:16 PM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement