ఫిబ్రవరి 20 కల్లా వెళ్లిపోవాలి: నారాయణ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 20 నాటికి మున్సిపల్ కమిషనర్, డెరైక్టరేట్ పరిధిలో ఉన్న ఉద్యోగులంతా గుంటూరుకు తరలివెళ్లాలని పురపాలక మంత్రి నారాయణ ఆదేశించారు. మార్కెట్ యార్డ్ భవనంలో తాత్కాలిక ఆఫీసు ఏర్పాటు చేశామని, ఫిబ్రవరి 20 కల్లా ఉద్యోగులంతా గుంటూరు వెళ్లి వ్యవహారాలు నడిపించాలని మౌఖిక ఆదేశాలిచ్చారు. వసతికి అదే కార్యాలయంలో డార్మెట్రీలు ఏర్పాటు చేసినట్టు ఉద్యోగులతో అన్నట్టు తెలిసింది.
దీంతో హైదరాబాద్ మున్సిపల్ డెరైక్టరేట్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కలకలం రేగింది. అన్ని వ్యవహారాలు సచివాలయంతో ముడిపడి ఉన్నప్పుడు అక్కడి నుంచి విధులు నిర్వహించడం కష్టమని ఉద్యోగులు అంటున్నారు. పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయని, ఇప్పటికిప్పుటు కుటుంబాన్ని ఏలా తరలించాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మూకుమ్మడి సెలవులపై వెళుతామని హెచ్చరిస్తున్నారు.
వసతులు కల్పించాకే: అశోక్‌బాబు
నెల్లూరు: నూతన రాజధానిలో ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించిన తర్వాతే కార్యాలయాలను తరలించాలని ఏపీఎన్ జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. బుధవారం నెల్లూరులోని ఎన్‌జీవో గృహంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వసతులు లేకుండా ఉద్యోగులు రావడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. సచివాలయం ఉద్యోగులందరూ రావాలంటే కనీసం 15 వేల ఇళ్లు అవసరమవుతాయన్నారు. హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించుకున్నవారికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోరారు.