విజయవాడ : రాజధానికి దగ్గరలో ఉన్న బందరు పోర్టు నిర్మాణానికి కావాల్సిన స్థల సర్వే పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మంగళవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు మొత్తం 5300 ఎకరాల ప్రైవేటు, ప్రభుత్వ భూమలను సర్వే చేసినట్లు తెలిపారు. ఈ పోర్టు నిర్మిస్తే రాజధాని ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందన్నారు. భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, వారికి అనుమానాలుంటే నివృత్తి చేసి ముందుకు సాగుతామన్నారు. మచిలీపట్నంలో మెరైన్ అకాడమీని 300 ఎకరాల్లో నిర్మిస్తామని చెప్పారు. అక్కడే 25 ఎకరాల్లో క్రీడా స్టేడియం నిర్మాణానికి కసరత్తు చేస్తున్నామన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆసక్తి కనపరుస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచి జరిగే ఎక్‌పోర్టు, ఇంపోర్ట్ అంతా మచిలీపట్నం పోర్టు నుంచి చేస్తే లాభదాయకంగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి నల్గొండలో మెరైన్ హబ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు.
మంత్రి రవీంద్ర తన శాఖకు సంబంధించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ ప్రవేశ పెట్టే యోచనలో ఉన్నామని చెప్పారు. ఇప్పటికే తమిళనాడులోని లిక్కర్ పాలసీపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. వచ్చే వారం కేరళలోని లిక్కర్ పాలసీపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీల్లోని మెరుగైన విధానాలను ఏపీలో అమలు చేస్తామన్నారు.
బందరు పోర్టుకు సర్వే పూర్తి : మంత్రి రవీంద్ర
Published Tue, Apr 28 2015 7:13 PM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM
Advertisement