
మంత్రులు దద్దమ్మలు..!
అనంతపురం అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయూల్సిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని ఏపీ రైతు సంఘం నేతలు విమర్శించారు. రైతురుణ మాఫీ వెంటనే అమలు చేయూలని, కొత్త రుణాలు మంజూరు చేసి, కరువుజిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కె.వెంకటరెడ్డి నేతృత్వంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు హాజరైన ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ.... ఇంతకంటే సిగ్గులేని ప్రభుత్వం మరొకటి ఉండదన్నారు. రైతుల ఆవేదనను జిల్లాకు చెందిన మంత్రులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు.
సిగ్గులేకుండా వీరంతా ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఏసీ కారుల్లో తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని వెంటనే అమలు చేసి, కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2013 సంవత్సరానికి సంబంధించిన నష్టపరిహారం, ఇన్సూరెన్స్ వెంటనే రైతుల ఖాతాల్లోకి జమ చేయాలన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి మాట్లాడుతూ...ఖరీఫ్ పంట కాలం ముగుస్తున్నా రైతులకు ప్రకటించిన రుణమాఫీని కమిటీల పేరుతో ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపించారు. జిల్లాలో ప్రబలిన కరువును దృష్టిలో పెట్టుకుని రైతులకు 2013 సంవత్సరానికి రావాల్సిన రూ. 640 కోట్లు పరిహారం అందజేయూలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పుణ్యమా అని జిల్లాలో ఇటీవల 65 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బేషరతుగా రుణమాఫీ అమలు చేయూలని కోరారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.కె. వెంకటరెడ్డి మాట్లాడుతూ హంద్రీ-నీవా పూర్తి చేసి, రైతులకు సాగు నీరు అందిస్తే తప్పా ఈ జిల్లా రైతాంగం కోలుకోలేదన్నారు. లేనిపక్షంలో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలను గ్రామాల్లో, పట్టణాల్లో తిరగనీయకుడా అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌కు అందజేశారు. జిల్లా నేతలు నగేష్, సుబ్బిరెడ్డి, నాగరాజు, జె.వి.రమణ, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.