
అన్నదాతకు గుండెకోత
అకాల వర్షాలతో ఏపీ రైతు కుదేలు
సాక్షి, విజయవాడ బ్యూరో: అకాల వర్షాలు రెండోరోజు సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులను కుంగదీశాయి. రాయలసీమ, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పడి వంగర మండలం జగన్నాధవలసలో ఉపాధి పనులు చేస్తున్న మంతెన రూపవతి (19) మృతి చెందింది. జిల్లాలో వర్షాలకు మామిడి, జీడిమామిడి పూత రాలిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం జిల్లాలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. వరి కోతల సమయంలో వర్షాలు కురవడంతో తూర్పుగోదావరి జిల్లాల్లో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. కోసి ఆరబెట్టిన వరి పనులు తడిసిపోవడంతో దిగుబడి తగ్గుతుందని భయపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో వరి పంట నేలకొరిగింది. పొలాల్లోని ధాన్యం ఓదెలు తడిసిపోయాయి. ఉద్యాన పంటలైన నిమ్మ, జామ, అరటి, చీ నిమ్మ తోటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. సుమారు 10వేల హెక్టార్ల వరిపైరు నేలకూలింది.
రాయలసీమకు భారీ నష్టం: రాయలసీమలో రూ. 23 కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. అనంతపురం వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం వల్ల 20 మండలాల్లో పండ్లతోటలు, పంటలు దెబ్బతిన్నాయి. కర్నూలు జిల్లాలో 1350 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. శని, ఆదివారాల్లో కురిసిన వర్షాల వల్ల పిడుగుపాటుకు ఇద్దరు మరణించగా, గోడ కూలి ఓ మహిళ మరణించింది. వైఎస్‌ఆర్ జిల్లాలో వర్షానికి 475 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది.