పాక్ చెరనుంచి విడుదల కానున్న మత్స్యకారులు
సాక్షి, న్యూఢిల్లీ/ఎచ్చెర్ల క్యాంపస్ (శ్రీకాకుళం జిల్లా)/ విజయనగరం: పాకిస్తాన్‌లో బందీలుగా ఉన్న 20 మంది ఉత్తరాంధ్ర జాలర్లు వాఘా సరిహద్దు ద్వారా స్వదేశానికి తిరిగి రానున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌కు డిసెంబర్ 31న సమాచారం అందించింది. గుజరాత్‌కు చెందిన చేపల వేట బోటు యజమానులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 15 మంది జాలర్లను, విజయనగరం జిల్లాకు చెందిన ఐదుగురు జాలర్లను చేపల వేట కోసం నియమించుకున్నారు. 2018 నవంబర్ 28న జీపీఎస్ పనిచేయకపోవడంతో పొరపాటున పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి మూడు బోట్లలో 20 మంది జాలర్లు వెళ్లడంతో వారిని పాకిస్తాన్ కోస్ట్ గార్డులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి వీరు కరాచీ జైలులో మగ్గుతున్నారు.
ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్ 10న రాజ్యసభ సభ్యులు(ప్రస్తుత వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత) వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నాటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిసి సమస్యను నివేదించారు. తదనంతరం అనేకమార్లు విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం ఈ విషయాన్ని విదేశాంగ దృష్టికి తెచ్చింది. 22 ఆగస్టు 2019న కూడా మరోసారి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. పలుమార్లు లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఈ అంశాన్ని పార్లమెంట్ సమావేశాలు, ఇతర సందర్భాల్లో కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న వాఘా సరిహద్దు నుంచి వారు స్వదేశానికి రానున్నట్టు పాకిస్తాన్ విదేశాంగ శాఖ పాకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది.
చెర వీడనున్న జాలర్లు వీరే..
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన కె.ఎర్రయ్య, కేశం రాజు, సన్యాసిరావు, ఎం.రాంబాబు, జి.రామారావు, ఎస్.అప్పారావు, కల్యాణ్, ఎస్.కిశోర్, గురుమూర్తి, సుమంత్, బడివానిపేటకు చెందిన బాడి అప్పన్న, శామ్యూల్, వెంకటేశ్, మణి, శ్రీకాకుళం మండలం దమ్మలవీధికి చెందిన శివ, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన బవిరిడు, నక్కా అప్పన్న, ధనరాజు, నక్కా కొండ, భోగాపురం మండలం ముక్కామకు చెందిన ఎం.గురువులు పాకిస్తాన్ చెర వీడనున్నారు. వీరిని స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు శ్రీకాకుళం ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ వీవీ కృష్ణమూర్తితో కూడిన అధికారుల బృందం ఢిల్లీ పయనమైంది.
ఉపాధి కోసం గుజరాత్‌కు..
ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఉపాధి కోసం ఎక్కువగా గుజరాత్ రాష్ట్రానికి వలస వెళుతుంటారు. చిత్రమేమిటంటే వలసదారుల్లో 2,500 మంది వరకు చిన్నపిల్లలే. డ్రైవర్లు దళారులుగా మారి గుజరాత్ బోటు యజమానుల నుంచి అడ్వాన్సులు తీసుకుని ఉత్తరాంధ్ర మత్స్యకారులను పనికి తీసుకువెళుతున్నారు. అక్కడ తండేలు, సహాయ తండేలు, కళాసీలుగా పనిచేస్తే రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకూ జీతం ఇస్తుంటారు. పిల్లలకైతే రూ.6 వేల లోపు జీతం వస్తుంది.
ఏడాదిగా ఎదురు చూస్తున్నాం
ఏడాది తరువాత మా కొడుకు వస్తున్నాడని విదేశాంగ శాఖ ద్వారా సమాచారం అందింది. ఈ విషయం తెలిసి ఎంతో ఆనందపడుతున్నాం. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా రాష్ట్రాలు దాటి కూలికి పంపిస్తే అనుకోని విధంగా శత్రు దేశమైన పాక్‌కు పొరపాటున మా వాళ్లు బందీ అయ్యారు.
–నక్కా నర్సమ్మ, తిప్పలవలస
ఏకాకిగా మిగిలాను
నా భర్త నక్కా అప్పన్న, కుమారుడు నక్కా ధనరాజు పాక్‌కు బందీలుగా చిక్కడంతో ఏకాకిగా మిగిలి వారి కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నాను. రెండు రోజుల్లో వారు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఏడాదిగా చాలా బాధగా వున్నాం.
–నక్కా పోలమ్మ, తిప్పలవలస
Comments
Please login to add a commentAdd a comment