మంత్రి నారా లోకేశ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వం నిరుద్యోగ భృతిపై కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు రూ. వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతిని అందించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ మేరకు మంత్రి వర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది నిరుద్యోగులకు భృతిని అందించనున్నట్లు వెల్లడించారు. ఒక కుటుంబంలో ఇద్దరికి భృతిని అందజేస్తామని చెప్పారు. భృతిని అందుకోవడానికి కనీస విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలని తెలిపారు.
ఏపీలో నిరుద్యోగులు ఉండకూడదని ఆశిస్తున్నట్లు లోకేశ్ అన్నారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మ్యానిఫెస్టోలో నిరుద్యోగులకు రూ. 2 వేలు భృతి ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, భృతి చెల్లింపు కోసం 7 దేశాల్లో నిరుద్యోగ భృతి పథకం ఎలా అమలవుతుందో పరిశీలించినట్లు లోకేశ్ వెల్లడించారు.
పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే భృతి పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. పథకం విధివిధానాలపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజల్లో చర్చ జరిగిన అనంతరం ఏవైనా మార్పులు ఉంటే చేస్తామని చెప్పారు. పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment