'రివర్స్' హోరా హోరీ! | Ap Government Big Success Veligonda Reverse Tendering Process | Sakshi
Sakshi News home page

'రివర్స్' హోరా హోరీ!

Published Sun, Oct 20 2019 3:54 AM | Last Updated on Sun, Oct 20 2019 1:55 PM

 Ap Government  Big Success Veligonda Reverse Tendering Process - Sakshi

సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌(సొరంగం)లో మిగిలిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌ సూపర్‌హిట్‌ అయింది. నాలుగు కాంట్రాక్టు సంస్థలు హోరాహోరీగా తలపడ్డాయి. వెలిగొండ ప్రాజెక్టు సీఈ జలంధర్‌ పర్యవేక్షణలో అధికారులు శనివారం ఆర్థిక బిడ్‌ తెరవగా నాలుగు సంస్థలు పోటాపోటీగా తక్కువ ధర కోట్‌ చేస్తూ షెడ్యూళ్లు దాఖలు చేశాయి. బిడ్‌లో తక్కువ ధర కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన సంస్థ పేర్కొన్న రూ.512.50 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2.45 గంటలపాటు ఈ–ఆక్షన్‌ నిర్వహించారు.

ప్రతి 15 నిముషాలకు ఒకసారి పోటాపోటీగా తక్కువ ధర(లెస్‌)కు రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్, పటేల్‌ ఇన్‌ఫ్రా, ఆర్‌ఆర్‌ ఇన్‌ఫ్రా కోట్‌ చేస్తుండటంతో ప్రక్రియ పూర్తయ్యే వరకూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ–ఆక్షన్‌ ముగిసే సమయానికి 7 శాతం తక్కువ ధర (రూ.491.37 కోట్లు)కు కోట్‌ చేసిన మేఘా సంస్థ ఎల్‌–1గా నిలిచింది. దీంతో ఆ సంస్థకే పనులు అప్పగించేలా సీవోటీ (కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌)కి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వెలిగొండ రెండో టన్నెల్‌లో మిగిలిన పనులకు నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లో ప్రభుత్వ ఖజానాకు రూ.61.76 కోట్లు ఆదా అయ్యాయి. తద్వారా ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తిరుగులేనిదని మరోసారి ప్రస్ఫుటమైంది.

నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు..!
వెలిగొండ రెండో టన్నెల్‌ పనుల్లో అక్రమాలను నిగ్గు తేల్చిన నిపుణుల కమిటీ మిగిలిన పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆ మేరకు మిగిలిన పనుల విలువ రూ.553.13 కోట్లుగా నిర్ణయించిన ప్రభుత్వం గత నెల 21న రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. శనివారం వెలిగొండ అధికారులు ప్రైస్‌(ఆర్థిక బిడ్‌) తెరిచారు. రూ.512.50 కోట్లకు కోట్‌ చేస్తూ షెడ్యూలు దాఖలు చేసిన ఒక కాంట్రాక్టు సంస్థ ఎల్‌–1గా నిలిచినట్లు వెల్లడైంది.

రూ.512.50 కోట్లను కాంట్రాక్టు విలువగా పరిగణించి ఈ–ఆక్షన్‌ నిర్వహించారు. ఈ–ఆక్షన్‌ గడువు ముగిసే సమయానికి రూ.491.37 కోట్లు (రూ.491,36,89,564) కోట్‌ చేసిన ఎంఈఐఎల్‌ (మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్ట్రాస్టక్చర్‌ లిమిటెడ్‌) సంస్థ ఎల్‌–1గా నిలిచింది. 7 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చిన మేఘా సంస్థకే పనులు అప్పగించాలని సీవోటీ(కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌)కు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.

పారదర్శకతకు గీటురాయి..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే టెండర్ల వ్యవస్థను ప్రక్షాళన చేశారు. ఎక్కువ మంది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు సడలించాలని సూచించారు. ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌ వేదికగా ఆన్‌లైన్‌లో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. చంద్రబాబు హయాంలో వెలిగొండ రెండో టన్నెల్‌ను రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ 4.69 శాతం ఎక్సెస్‌కు దక్కించుకున్నది. అదే సంస్థ ఇపుడు రివర్స్‌ టెండరింగ్‌లోనూ పాల్గొని అంతకన్నా తక్కువకు షెడ్యూలు దాఖలు చేసింది. ఆర్థిక బిడ్‌లోనూ, ఈ–ఆక్షన్‌లోనూ కాంట్రాక్టు విలువ కంటే తక్కువ ధరకు  రిత్విక్‌ ప్రాజెక్టŠస్‌ కోట్‌ చేసింది. దీనిని బట్టి చంద్రబాబు హయాంలో ఎక్కువ ధరకు సొంతవాళ్లకు కట్టబెట్టి ప్రజాధనాన్ని అప్పనంగా అప్పగించినట్లు అర్ధమవుతోందని ఇంజనీరింగ్‌ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు గతంలో ఎక్కువ ధరకు దక్కించుకున్న రిత్విక్‌ సంస్థే ఇపుడు తక్కువ ధరకు కోట్‌ చేయడం, ఆసంస్థ కోట్‌ చేసిన ధర కంటే మరింత తక్కువ ధరకు మేఘా కోట్‌ చేసి టెండర్‌ దక్కించుకోవడం, మొత్తంగా రూ. 61.76 కోట్లు ప్రజాధనం ఆదా అవడం చూస్తే రివర్స్‌టెండరింగ్‌ విధానమనేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ముందు చూపుతో, విజŠక్షతతో తీసుకున్న నిర్ణయమని మరోసారి తేటతెల్లమయిందని సాగునీటి రంగ నిపుణులు, కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

ఆదా జరిగింది ఇలా...
వెలిగొండ రెండో సొరంగం పనులను 2006–07లో హెచ్‌సీసీ–సీపీపీఎల్‌ సంస్థ రూ.735.21 కోట్లకు దక్కించుకుంది. 8,580 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం,  9.2 మీటర్ల వ్యాసంతో 18.787 కి.మీ.ల పొడవున సొరంగం తవ్వి 0.3 మీటర్ల మందంతో లైనింగ్‌ పనులను పొడిగించిన గడువు ప్రకారం 2020 మార్చి నాటికి ఆ సంస్థ పూర్తి చేయాలి. కానీ ఆ సంస్థపై గతేడాది ఆగస్టులో 60 సీ కింద వేటు వేశారు. అప్పటికి 10.750 కి.మీ.ల పనులను పూర్తి చేయగా రూ.489 కోట్ల బిల్లులు చెల్లించారు. అంటే రూ.246.21 కోట్ల పనులు మిగిలాయి.

కానీ 60 సీ కింద తొలగించినప్పుడు ఆ పనుల విలువను రూ.299.48 కోట్లుగా తప్పుగా లెక్కించారు. 2017–18 ధరల ప్రకారం ఆ పనుల విలువను రూ.720.26 కోట్లకు పెంచేశారు. ఈ పనులకు రూ.570.58 కోట్ల అంచనాతో గతేడాది ఆగస్టులో టెండర్లు పిలిచిన చంద్రబాబు సర్కార్‌ రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 4.69 శాతం అధిక ధరకు అంటే రూ.597.35 కోట్లకు కట్టబెట్టి భారీ ఎత్తున లబ్ధి చేకూర్చింది. ఆ సంస్థ ఇప్పటివరకూ 462 మీటర్ల పనులు మాత్రమే చేసింది. వాటి విలువ తీసివేయగా మిగిలిన పనుల విలువను రూ.553.13 కోట్లుగా లెక్కించారు.

ఇందులో 4.69 శాతం ఎక్సెస్‌ను తీసివేయగా వచ్చిన రూ. 528.35 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ముందుగానే రూ. 24.78 కోట్లు ఆదా అయ్యాయి. 528.35 కోట్ల అంచనా వ్యయంతో నిర్వహించిన టెండర్లలో 7 శాతం తక్కువ ధరకు అంటే రూ. 491.37 కోట్లకు మేఘా దక్కించుకుంది. దాంతో మొత్తమ్మీద 11.69 శాతం తక్కువ ధరకు పనులు అప్పగించినట్లయింది. దానివల్ల 61.76 కోట్లు ఆదా అయ్యాయి.

రివర్స్‌తో ఇప్పటివరకు రూ.903.09 కోట్లు ఆదా
►పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం రివర్స్‌ టెండర్లలో రూ.782.80 కోట్లు,
►లెఫ్ట్‌ కనెక్టివిటీ (65వ ప్యాకేజీ ) పనులకు నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లో రూ.58.53 కోట్లు
►వెలిగొండ రెండో టన్నెల్‌ మిగిలిన పనులకు నిర్వహించిన రివర్స్‌ టెండర్లలో రూ.61.76 కోట్లు
►మొత్తం ఆదా అయ్యింది రూ. 903.09 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement