విజయవాడకు వెలుగులు లేనట్టే | ap Government can't to power conclude | Sakshi
Sakshi News home page

విజయవాడకు వెలుగులు లేనట్టే

Published Wed, Oct 1 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

విజయవాడకు  వెలుగులు లేనట్టే

విజయవాడకు వెలుగులు లేనట్టే

అందరికీ విద్యుత్‌పై తేల్చని సర్కారు
 
రోజుకో రీతిగా మారుతున్న సీన్
గుంటూరు, విశాఖలకు మొండి చెయ్యి.. తిరుపతి, ఏలూరు, విజయనగరాలకు చోటు
వ్యవసాయ ప్రాంతాలకు పథకం దూరం
డిమాండ్ పెరిగే చోట నో చాన్స్
అధికారులతో సీఎం సమాలోచనలు.. నేడు కేబినెట్‌లో ఓ కొలిక్కి

 
హైదరాబాద్/ విజయవాడ బ్యూరో: ‘అందరికీ విద్యుత్’ ఆదిలోనే షాక్ కొడుతోంది. ఈ పథకంకింద ఎంపిక చేయాల్సిన ప్రాంతాల్లో తాత్కాలిక రాజధాని విజయవాడ గల్లంతైంది. గుంటూరు నగరం పేరు కనపడలేదు. ఐటీ హబ్‌గా మారుస్తామని చెప్పిన విశాఖకు స్థానం దొరకలేదు. ఇప్పటికే నిరంతర విద్యుత్ సరఫరా అవుతున్న తిరుపతిని చేర్చి రాష్ట్ర సర్కారు చేతులు దులిపేసుకుంటోంది. వాణిజ్య ప్రాంతాలు, వ్యవసాయ పంపుసెట్లు ఉన్న మండలాలకు వెలుగు పంచేందుకు ప్రభుత్వం ధైర్యం చేయడం లేదు. ఏడాదిగా డిమాండ్ పెరుగుతున్న పట్టణాలు, బిల్లులు తక్కువగా వసూలవుతున్న ప్రాంతాలను దూరంగా పెట్టే యోచనలో ఉంది. ఇందులో భాగంగానే గుంటూరు, కృష్ణా జిల్లాలోని వ్యవసాయ ఆధారిత మండలాలకు ఈ పథకంలో చోటుదక్కలేదు. అందరికీ విద్యుత్ పథకాన్ని అక్టోబర్ 2 నుంచి అమలు చేయాల్సి ఉంది. ఈ పథకాన్ని ఏయే ప్రాంతాల్లో అమలు చేస్తారన్న విషయమై అదేరోజు ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి. అయితే ఏయే ప్రాంతాలకు అమలు చేయాలనే విషయం ఇప్పటివరకూ తేలలేదు. వారం రోజుల క్రితం పథకం అమలు చేసే రెండు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, 39 మండలాలపై ప్రాథమిక అంచనాకు వచ్చారు.

తాజాగా మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో  ఉన్నతాధికారులు జరిపిన సుదీర్ఘ చర్చల్లో ‘అందరికీ విద్యుత్’ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఎంపిక చేయాల్సిన ప్రాంతాలపై ప్రభుత్వం స్పష్టతకు రాలేకపోయింది. విజయనగరం, పెద్దాపురం, అనకాపల్లి, సామర్లకోట, సూళ్లూరుపేట, తణుకు, మచిలీపట్నం, పలమనేరు, మాచర్ల మున్సిపాలిటీలకు తొలి జాబితాలో స్థానం లభించినట్లు సమాచారం. అలాగే ప్రముఖ ఆలయాలున్న అన్నవరం, మంత్రాలయం, ద్వారకా తిరుమల, కాణిపాకం, శ్రీశైలం, శ్రీకాళహస్తి మండలాల్లో కూడా ‘అందరికీ విద్యుత్’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మిగతా వాటిపై బుధవారం జరిగే కేబినెట్‌లో చర్చల తర్వాత స్పష్టత వస్తుందని ఏపీ ఇంధన కార్యదర్శి అజయ్ జైన్ ‘సాక్షి’కి తెలిపారు.

సీన్ మారింది

రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో  నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని యోచించారు. అయితే రాష్ట్రంలోని ఎస్‌పీడీసీఎల్, ఈపీడీసీఎల్ సంస్థలు అన్ని నగరాలు, పట్టణాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు అవసరమైన సదుపాయాలు లేవని అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో తొలివిడతలో లైన్‌లాస్( విద్యుత్ సరఫరా నష్టం) అతి తక్కువగా ఉండి, బిల్లుల చెల్లింపు 95 శాతానికి పైగా ఉన్న నగరాలు, పట్టణాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావించింది. విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణాన్ని తొలి జాబితాలో చేర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు డిస్కంల నుంచి అన్ని వివరాలతో కూడిన సమాచారం తెప్పించుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఉత్పత్తి, డిమాండ్ మధ్య అంతరం ఏర్పడుతోందని, వారం రోజుల క్రితం 8 మిలియన్ యూనిట్ల లోటు కన్పించిందని విద్యుత అధికారులు తమ నివేదికల్లో పేర్కొన్నారు. మూడు ప్రాంతాల్లోనూ అక్టోబర్ నుంచి విద్యుత్ వినియోగం 25 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దీనికి తోడు రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలను బొగ్గు కొరత వేధిస్తోంది. జలవిద్యుత్ ఉత్పత్తి బొటాబొటిగా ఉంది. ఈ రెండూ కలిపినా 90 మిలియన్ యూనిట్లు దాటే పరిస్థితి లేదు. వినియోగం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాలవల్ల ఇప్పుడున్న 125 మిలియన్ యూనిట్లు, ఏకంగా 190 మిలియన్ యూనిట్లకు చేరే వీలుందని అధికారులు తెలిపారు. దీంతో ఒక్క తిరుపతి మినహా, విజయవాడ, విశాఖలో పథకం అమలుకు సర్కారు వెనక్కు తగ్గింది. అయితే తాత్కాలిక రాజధాని విజయవాడను పక్కన పెట్టే ఆలోచన సరికాాదని, ఏదో రకంగా జాబితాలోకి తేవాలని ప్రభుత్వం అధికారులను కోరినట్టు తెలిసింది. ఇక ఇప్పటికే 24 గంటలు విద్యుత్ అందిస్తున్న తిరుపతిని జాబితాలో చేర్చినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎస్‌పీడీసీఎల్ స్పష్టంచేసినట్లు సమాచారం.
 
విజయవాడకు ఇప్పట్లో లేనట్టే!

తాత్కాలిక రాజధాని బెజవాడలో నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి సబ్‌స్టేషన్ల సామర్థ్యం పెంచుకోవడం, విద్యుత్ సరఫరా లైన్లను బలోపేతం చేయడంతోపాటు ఇతర సదుపాయాల కోసం రూ.500 కోట్లు అవసరమని ఎస్‌పీడీసీఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఈ సొమ్ము అందిస్తే అక్టోబరు 2వ తేదీ నుంచి నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి సిద్ధమవుతామని రెండు నెలల కిందటే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. డిస్కం అధికారులు విజయవాడ నగరంతో పాటు ఇబ్రహీంపట్నం, బంటుమిల్లి, మచిలీపట్నం మున్సిపాలిటీలో నిరంతర విద్యుత్ సరఫరాకు సిద్ధమైంది. కానీ నిధులు అందించే విషయంలో సర్కారు ముందడుగు వేయకపోవడంతో డిస్కంలు కూడా వెనుకడుగు వేస్తున్నాయి. వ్యవసాయ కనెక్షన్లు లేని ప్రాంతాల్లో నిరంతరం విద్యుత్‌సరఫరా చేద్దామనే ఆలోచన చేశామనీ, కానీ సర్కారు నిధులివ్వకుండా భారం మొత్తం డిస్కం మీదే వేయాలనుకుంటే ఎలా? అని ఒక అధికారి ప్రశ్నించారు. ఈ కారణాల రీత్యా తొలి విడతలో బెజవాడకు స్థానం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే లైన్‌లాస్ తక్కువగా, విద్యుత్ బిల్లుల చెల్లింపులు ఆశాజనకంగా ఉన్న ఏలూరు కార్పొరేషన్‌తోపాటు విజయనగరం మున్సిపాలిటీని చేర్చడంపై ఓ స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. గుంటూరు పట్టణాన్ని కూడా చేర్చాలని అనుకున్నా, ఇక్కడ రెవెన్యూ ఆశాజనకంగా లేదని, డిమాండ్ విపరీతంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. వాణిజ్య కనెక్షన్లు ఎక్కువగా ఉండటం పట్టణానికి శాపమైతే, జిల్లా పరిధిలోని మండలాల్లో వ్యవసాయ కనెక్షన్లు ఎక్కువగా ఉండటం నిరంతర విద్యుత్‌కు నోచుకునే ఆస్కారం కన్పించడం లేదు.
 
కొన్ని ఇబ్బందులు వున్నాయి: హెచ్‌వై దొర, సీఎండీ, ఎస్‌పీడీసీఎల్

విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాం. అయితే ఈ విషయం అధికారికంగా ప్రకటించేందుకు కొన్ని ఇబ్బందులు వున్నాయి. ఒకటికి రెండుసార్లు ఆలోచించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాకే బెజవాడలో నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించడం మేలని అనుకుంటున్నాం. తిరుపతిలో నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement