‘ఏరు దాటే వరకూ ఊరింపు.. దాటాక వెక్కిరింపు’ అన్నట్టుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు. ‘ఇంటికో ఉద్యోగం ఇస్తా’.. ఇది ఆయన ఎన్నికల్లో చేసిన వాగ్దానం. ‘ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఉద్వాసన’ ఇదీ ఇప్పుడాయన సర్కారు అమలు చేస్తున్న విధానం. అధికారంలోకి రాగానే రైతు, డ్వాక్రా రుణాల్ని మాఫీ చేస్తానన్న ఆయన వాటిపై పూటకో మాట మారుస్తున్నా.. ‘ఉపాధి మాఫీ’ అమలులో మాత్రం చురుకుగా వ్యవహరిస్తున్నారు.
సాక్షి, రాజమండ్రి : వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇళ్లకు సాగనంపేందుకు చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ఒక పక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై కమిటీ వేశామంటూనే వారిని తొలగించనుంది. ఈ పొట్టకొట్టే నిర్ణయాన్ని ముందుగా గృహ నిర్మాణ శాఖ నుంచి అమలు చేయనున్నారు. ఆ శాఖలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఈనెల 31 నుంచి ఇంటికి పంపేందుకు అధికారులు శ్రీముఖాలు సిద్ధం చేశారు.
హతాశులైన చిరుద్యోగులు
జలయజ్ఞం పథకం భూసేకరణ విభాగంలోని వివిధ యూనిట్లలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుతో ఈ ‘ఉపాధి మాఫీ’ ప్రారంభమైంది. అనంతరం గృహనిర్మాణ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను జూన్ 30 నుంచి తొలగించాలని గత నెల రెండో వారంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు ఆందోళన చే యడంతో తొలగింపు గడువును జూలై 31 వరకూ పెంచారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 220 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇప్పుడు తొలగించనున్నారు.
ఈ నెలాఖరున ‘నో డ్యూటీ’ సర్టిఫికెట్లు తీసుకుని ఉద్వాసన పలకాలని సర్క్యులర్లు జారీ అయ్యాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం కమిటీ వేసిందన్న వార్తతో తమ కొలువులు మరి కొంత కాలం కొనసాగుతాయని ఆశించిన చిరుద్యోగులు హతాశులయ్యారు. గృహ నిర్మాణశాఖ అనంతరం ఇదే విధానాన్ని మిగిలిన శాఖల్లోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న 4500 మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.
జీతాల సొమ్ముకు కేటాయింపులు కరువు..
గృహ నిర్మాణ శాఖలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన రాష్ట్రంలో 1200 మంది వరకూ పని చేస్తున్నారు. వీరికి ఏటా జీతాలు చెల్లిం చేందుకు రూ.39 కోట్లు అవసరమని ఆ శాఖ అధికారులంటున్నారు. ఆర్థికశాఖ నుంచి ఇప్పటి వరకూ కొత్తగా ఎలాంటి కేటాయింపులు లేనందున ఉద్యోగులను కొనసాగించి, జీతాలను చెల్లించడం కష్టతరమంటున్నారు. ప్రభుత్వం వారిని కనికరిస్తే తప్ప ఉద్యోగులను కొనసాగించలేమని తెగేసి చెబుతున్నారు.
‘గెటౌట్’ సోర్సింగే..
Published Sat, Jul 19 2014 12:03 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement