సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన అనంతరం గత చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలో తెలియజేయాల్సిందిగా గత చంద్రబాబు ప్రభుత్వంలోని అధికారులు కేంద్ర హోం శాఖను కోరారు. దీనిపై కేంద్ర హోం శాఖ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ఒరిజనల్ బ్రాండ్ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో లాగానే నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది.
దేశంలో విడిపోయిన నాలుగు రాష్ట్రాలు ఆ విభజన తేదీ నాడే అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని, అసలు రాష్ట్రాలు మాత్రం పాత అవతరణ తేదీ నాడు దినోత్సవాలనే చేసుకుంటున్నాయని తెలిపింది. అయినా సరే చంద్రబాబు సర్కార్ గత ఐదేళ్లూ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనే లేదు. దాని స్థానే జూన్ 2న నవనిర్మాణ దీక్ష పేరుతో కోట్ల రూపాయలను ప్రచారాలకు వెచ్చించింది. ఉత్సవాల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లపై సీఎస్ ఈ నెల 21న ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment