సాక్షి, అమరావతి: ఉద్యోగుల జీతాల పెంపునకు ఉద్దేశించిన 11వ వేతన సవరణ సంఘాన్ని(పీఆర్సీ) ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఉద్యోగు లకు పీఆర్సీ పాత బకాయిల్లో ప్రస్తుతానికి ఒక వాయిదా ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం మంత్రివర్గం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశ నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు సహచర మంత్రులతో కలిసి మీడియాకు వివరించారు. పీఆర్సీ బకాయిలు రూ.3,999 కోట్లు ఉండగా, వీటిని విడతల వారీగా చెల్లించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఎన్ని విడతలనేది ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా మని తెలిపారు. పెన్షనర్లకు నగదు రూపంలో, ఉద్యోగులకు జీపీఎఫ్ రూపంలో చెల్లింపులు జరపాలని నిర్ణయించారు. కొత్త పీఆర్సీ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోగా నివేదికను అందజేయాలని గడువు విధించింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంపై కేబినెట్‌లో చర్చించినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి వివరించారు.
యూజర్ చార్జీలకు అనుమతి
అమృత్ పథకం కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పురపాలక సంఘాల్లో యూజర్ చార్జీల వసూలు పాలసీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ యాక్ట్‌లో మార్పులు చేయడానికి మంత్రివర్గం అనుమతి తెలిపింది.
మంత్రివర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు...
- ఏపీ వర్చువల్ క్లాస్‌రూమ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని విద్యాలయాల్లో వర్చువల్ క్లాసురూమ్‌ల ఏర్పాట్లను కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది.
- మచిలీపట్నం పోర్టు అభివృద్దికి, అక్కడ డీప్ వాటర్ పోర్ట్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు రూ.1,092 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీగా ఉండి వివిధ బ్యాంకుల నుంచి సమకూర్చుకోవాలన్న ప్రతిపాదనకు ఆమోదం.
- అనంతపురం జిల్లా గౌనివారిపల్లిలో బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం.
- అనంతపురం జిల్లాలోని రామగిరి, కనగానపల్లిలో 160 మెగావాట్ల సామర్థ్యం గల విండ్ సోలార్ హైబ్రీడ్ పవర్ ప్రాజెక్టు నెలకొల్పడానికి అనుమతి.
- అంతర్గత జలరవాణాలో భాగంగా ఇబ్రహీంపట్నం– లింగాయ పాలెం మధ్య ఫెర్రీ సర్వీసులు నిర్వహించడానికి ప్రైవేట్ ఆపరేటర్ కు అనుమతి. తాత్కాలిక జెట్టీల ఏర్పాటుకు ట్రాన్స్‌పోర్టు కాంట్రా క్టరు జీటీ రామారావుకు అనుమతి.
- కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 161 ఎకరాల భూమిని టనాచు కార్పొరేషన్ స్టీల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయింపు. ఎకరం ధర రూ.మూడున్నర లక్షలు.
- సీఆర్‌డీఏ పరిధిలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలకు 51.92 ఎకరాల కేటాయింపు.
- గతంలో బ్రహ్మకుమారీస్ సొసైటీ పేరుతో కేటాయించిన 10 ఎకరాల భూమి, జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పేరుతో కేటాయించిన 50 ఎకరాల భూమి పేరు మార్పునకు అంగీకారం.
- కాకినాడ రూరల్ మండలంలోని రమణయ్యపేటలో 5.57 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన విష్ణు సేవాశ్రమం, యోగాశ్రమం నెలకొల్పేందుకు శ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర స్వామీ ట్రస్టుకు అప్పగిస్తూ ఆమోదం.
- ప్రకాశం బ్యారేజ్ నుంచి పెదగంజాం వరకు కొమ్మమూరు కాలువ ద్వారా వరద నీటి మళ్లింపు ప్రాజెక్టు నివేదిక కోసం వాప్కోస్ సంస్థకు రూ.3.59 కోట్లు కన్సల్టెన్సీ ఫీజుగా చెల్లించేందుకు పరిపాలనపరమైన అనుమతికి ఆమోదం.
ఉద్యోగులకు 11వ పీఆర్సీ
Published Thu, May 3 2018 2:54 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment