సాక్షి, అమరావతి: అతి త్వరలో రాష్ట్రంలో రోడ్లపై విద్యుత్ బస్సులు పరుగులు తీయనున్నాయి. ఈ బస్సులతో గాలి, ధ్వని కాలుష్యం తగ్గనుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఏపీకి 300 విద్యుత్ బస్సులను కేటాయించింది. డీజిల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీ ఏటా రూ.300 కోట్ల వరకు నష్టాల్ని చవిచూస్తోంది. దీంతో ఇప్పటివరకు డీజిల్, సీఎన్‌జీ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ నిర్వహణ వ్యయం తగ్గించేందుకు విద్యుత్ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే విద్యుత్ బస్సుల నిర్వహణపైన నిపుణుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. డీజిల్ బస్సులు నడపడం వల్ల కిలోమీటరుకు డ్రైవర్ జీతభత్యంతో కలిపి రూ.38 వరకు ఖర్చవుతుంది.
అదే విద్యుత్ బస్సు నిర్వహణ ఖర్చు కిలోమీటరుకి రూ.19 వరకే అవుతుందని నిపుణుల కమిటీ తేలి్చంది. కేంద్ర ప్రభుత్వం ఫేమ్–2 (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా) పథకం కింద దేశంలో 64 నగరాలకు 5,595 విద్యుత్ బస్సులను మంజూరు చేయగా, ఏపీకి 300 విద్యుత్ బస్సులు కేటాయించింది. విశాఖపట్నంకు వంద, విజయవాడ, అమరావతి, తిరుపతి, కాకినాడలకు 50 చొప్పున మంజూరు చేశారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.2.18 కోట్ల వరకు ఉండగా.. కేంద్రం 40% రాయితీ ఇవ్వనుంది. విద్యుత్ బస్సులో సీసీ కెమెరాలు, 31 సీట్ల సామర్థ్యం, ఆటోమేటిక్ గేర్లు ఉంటాయి. రెండు గంటలు చార్జింగ్ చేస్తే నిరంతరాయంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు బస్సు నడుస్తుందని ఆర్టీసీ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.
700 బస్సుల కోసం ప్రయత్నాలు
రాష్ట్రంలో ఈ ఆరి్థక సంవత్సరంలోనే వెయ్యి విద్యుత్ బస్సుల్ని నడిపేందుకు ఆర్టీసీ గతంలోనే ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. వెయ్యి బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ (డీహెచ్‌ఐ)కు జూన్‌లోనే ప్రతిపాదనలు సమరి్పంచింది. విద్యుత్ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యూ అండ్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ), ఏపీ ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు (యూఐటీపీ) సహకారం అందిస్తాయి. ఇప్పటికే 300 బస్సులను కేటాయించడంతో మిగిలిన 700 బస్సుల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఆర్టీసీ విలీనంపై ఎలాంటి అనుమానాలొద్దు
ఆర్టీసీ విలీనంపై కార్మికులు ఎలాంటి అనుమానాలూ పెట్టుకోవద్దని, రెండు నెలల్లో ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నేతలకు స్పష్టం చేశారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘమైన ఎంప్లాయీస్ యూనియన్ నేతలు శుక్రవారం రవాణా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆర్టీసీ విలీన ప్రక్రియకు అధికారులు అడ్డుపడుతున్నారని, యాజమాన్యం సమస్యల పరిష్కారంలో ఏకపక్షంగా ముందుకు వెళుతోందని మంత్రికి వివరించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విలీనం హామీ ఇచ్చారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీఎం వెనక్కు వెళ్లరని తమకు ప్రగాఢ నమ్మకం ఉందన్నారు.
ఇందుకు మంత్రి పేర్ని నాని స్పందిస్తూ ఆర్టీసీని విలీనం చేసి ప్రయాణిస్తే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలన్న విధంగా సంస్ధను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. విలీన ప్రక్రియ ముగిసిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పెన్షన్ సౌకర్యం వర్తింపజేస్తామన్నారు. ఆర్టీసీ నిర్వహణ భారం తగ్గించేందుకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో విద్యుత్ బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. విలీనం జరిగిన తర్వాత ప్రభుత్వమే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఈయూ నేతలు వైవీ రావు, దామోదరరావు, కె.బాలాజీ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment