
సాక్షి, అమరావతి బ్యూరో: కొన్నాళ్లుగా ఊరిస్తున్న ఈజిప్టు ఉల్లి జిల్లాకు వచ్చేస్తోంది. ఈ మేరకు ఈజిప్టు నుంచి ఉల్లిపాయలతో బయలుదేరిన తొలి నౌక ఇప్పటికే ముంబైకి చేరింది. అక్కడ శనివారం రాత్రి ఉల్లిపాయలు లోడు చేసుకున్న లారీలు రాష్ట్రానికి బయలుదేరాయి. ఇవి సోమవారం నాటికి విజయవాడ చేరుకుంటాయని మార్కెటింగ్ శాఖ అధికారులుభావిస్తున్నారు.
మంగళవారం నుంచి విక్రయాలు
ప్రభుత్వం ఉల్లి కొరతను తీర్చడానికి ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఉల్లిపాయలు ఈజిప్టు నుంచి ముంబై పోర్టుకు నౌకలో వస్తాయి. అక్కడ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు లారీల్లో తరలిస్తారు. జిల్లాకు తొలి విడతలో 25 టన్నుల ఈజిప్టు ఉల్లిని కేటాయించారు. నగరానికి రాగానే మంగళవారం నుంచి వీటిని రాయితీపై పంపిణీ చేయనున్నారు. కొన్నాళ్లుగా కర్నూలు, తాడేపల్లిగూడెం, హైదరాబాద్‌ల నుంచి దిగుమతి చేసుకుంటుండగా.. కొద్దిరోజుల క్రితం అవి కూడా నిలిచిపోయాయి.
ప్రస్తుతం జిల్లాకు మహారాష్ట్రలోని సోలాపూర్, నాసిక్ ప్రాంతాల నుంచి రోజుకు 60–70 టన్నుల ఉల్లిపాయలు వస్తున్నాయి. ఉల్లి ధరలు ఆకాశన్నంటిన నేపథ్యంలో ప్రభుత్వం నవంబర్ 17 నుంచి రైతు బజార్లు, మార్కెట్ యార్డుల్లో రాయితీతో కిలో పాయలు రూ.25కే విక్రయిస్తోంది. తాజాగా ఈజిప్టు ఉల్లి కూడా అందుబాటులోకి రానుండడంతో వినియోగదారులకు ఉల్లిపాయల కొరత చాలా వరకు తీరనుంది. రాయితీ ఉల్లి అందుబా టులోకి తెచ్చినప్పట్నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 1,100 టన్నుల ఉల్లిని వినియోగదారులకు సరఫరా చేశామని మార్కెటింగ్ శాఖ డెప్యూటీ డైరెక్టర్ దివాకరరావు చెప్పారు.
మూడు రోజుల్లో రెండో నౌక..
రెండుమూడు రోజుల్లోనే మరో నౌక ఈజిప్టు నుంచి ఉల్లిపాయలతో ముంబైకి రానుంది. ఆ నౌక కూడా వస్తే మరిన్ని ఈజిప్టు ఉల్లిపాయలు రాష్ట్రానికి, జిల్లాకూ వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment