మరో 13% మద్యం షాపులు మూత | AP government reduces liquor outlets by 13 percent | Sakshi
Sakshi News home page

మరో 13% మద్యం షాపులు మూత

Published Sun, May 10 2020 3:10 AM | Last Updated on Sun, May 10 2020 8:34 AM

AP government reduces liquor outlets by 13 percent - Sakshi

అనంతపురం జిల్లా శింగనమలలో మద్యం దుకాణం వద్ద భౌతిక దూరం పాటిస్తూ క్యూ

సాక్షి, అమరావతి: దశలవారీ మద్యపాన నియంత్రణలో భాగంగా రాష్టప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు మరిన్ని కఠిన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల సంఖ్యను ఈ నెలాఖరు నాటికి 13 శాతం తగ్గిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఆగస్టులో 20 శాతం షాపులను తొలగించిన ప్రభుత్వం.. ఏడాదిలోపే మరో 13 శాతం షాపులను తొలగించేందుకు తాజా ఉత్తర్వులిచ్చింది. గతంతో పోలిస్తే.. ఈ నిర్ణయం వల్ల కేవలం 10 నెలల్లోనే 33 శాతం షాపులను తగ్గించినట్లవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,500 మద్యం దుకాణాలు ఉండగా.. తాజా నిర్ణయంతో ఈ నెలాఖరు నాటికి ఆ సంఖ్య 2,934 తగ్గనుంది. సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 వేల బెల్ట్‌ షాపులను పూర్తిగా తొలగించిన సంగతి తెలిసిందే. మద్యం వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. 

సారాకు అడ్డుకట్ట 
మరోవైపు నాటు సారాను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. తయారీదారులపై నిఘా పెట్టి తరచూ దాడులు జరిపిస్తోంది. సారా అధికంగా తయారు చేసే 147 ‘ఏ’ కేటగిరీ గ్రామాలను గుర్తించి విస్తృత తనిఖీలు చేయిస్తోంది. సారాను అరికట్టేందుకు వార్డు వలంటీర్లు, గ్రామ మహిళా మిత్ర, మహిళా రక్షక్‌ల సేవలను వినియోగిస్తోంది. దీంతోపాటు పొరుగు పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది.  

నియంత్రణకు తీసుకున్న చర్యలివీ..
► మద్యం దుకాణాల వద్ద గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 4,380 పర్మి ట్‌ రూమ్‌ల రద్దు.  ఒక వ్యక్తి గరిష్టంగా మ ద్యం లేదా బీరును కేవలం మూడు బాటి ల్స్‌ వరకు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం. అంతకు మించి కొనుగోలు చేసినా.. అమ్మినా చట్టపరమైన చర్యలకు ఆదేశం.  
► మద్యం అమ్మకాలను తగ్గించేందుకు విక్రయ వేళల కుదింపు. గతంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు జరిపేవారు. ప్రస్తుతం ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే విక్రయాలకు అనుమతి.  
► మద్యం వినియోగాన్ని గణనీయంగా తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న షాపుల సంఖ్య 4,380 నుంచి 3,500కు తగ్గిస్తూ గతేడాది ఆగస్టులో నిర్ణయం. 
► అక్రమ అమ్మకాలను నియంత్రించే చర్యల్లో భాగంగా ఏపీ బెవరేజేస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, స్వయంగా రిటైల్‌ అవుట్‌ లెట్స్‌ ద్వారా మద్యం అమ్మకాలు. 
► మరోవైపు వినియోగాన్ని తగ్గించేందుకు ధరలను పెంచుతూ నిర్ణయం. మద్యం కొనాలంటేనే భయపడేలా.. షాక్‌ కొట్టే విధంగా ధరల పెంపుదల. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్ల సంఖ్యలో 40 శాతం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న 840 బార్లు 530కి తగ్గాయి.  మద్యం వినియోగాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటు. మద్యపానం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించడం, మద్యం మహమ్మారి కుటుంబాలను ఏ విధంగా నాశనం చేస్తుందో తెలియజెప్పే ప్రచార కార్యక్రమాలకు చర్యలు. 
► మద్యం వినియోగాన్ని దశలవారీగా తగ్గించడానికి తీసుకున్న అన్ని చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయి. 2019 అక్టోబర్‌ నుంచి 2020 మార్చి వరకు మద్యం అమ్మకాలు 24 శాతం, బీరు అమ్మకాలు 55 శాతం తగ్గాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement