
అనంతపురం అగ్రికల్చర్: కరువు జిల్లా..ఏటా వర్షాభావంతో పంటలు పండలేదు. ప్రత్యామ్నాయ పనులూలేవు. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలు చేతికందక, పెట్టుబడి తిరిగి రాక, అప్పులు అధికమై రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నా.. ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారంలేదు. 4,5 విడతల రుణమాఫీ డబ్బుల కోసం రైతులు వేయి కళ్లతో ఎదురు చూశారు.రెండేళ్లుగా పైసాకూడా చూపించని ప్రభుత్వం.. ఎట్టకేలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు హడావుడిగా ఆదివారం సెలవురోజైనా జీఓ 38 విడుదల చేశారు.
♦ రుణమాఫీ పథకంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న 4, 5వ విడత మాఫీ సొమ్ము చెల్లిస్తామంటూ జీవోలో పేర్కొన్నారు. నగదు ఇస్తారా? లేదా చెక్కులు అంటగడతారా? అనేది జీవోలో స్పష్టత ఇవ్వకుండా ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేశారు.
♦ 2014 ఓన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ‘బ్యాంకు మెట్లు ఎక్కే పనిలేకుండా రైతులకు సంబంధించి అన్ని రకాల వ్యవసాయ రుణాలూ మాఫీ చేసి రుణ విముక్తులను చేస్తాం’’ అంటూ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాబు మాటలు నమ్మి రైతులు ఓట్లు వేసి టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాగానే చంద్రబాబు తన అసలు స్వరూపాన్ని చూపించారు. నిబంధనలు, షరతులు, కమిటీల పేరుతో ఏడాది పాటు కాలపాయన చేసి రైతులను గందరగోళంలోకి నెట్టేశారు. చివరకు పంట, బంగారు నగల తాకట్టుకు సంబంధించి కుటుంబానికి గరిష్టంగా రూ.లక్షన్నర, అది కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం చేస్తామంటూ ప్రకటించి ఇబ్బందుల్లోకి నెట్టారు.
రూ.6,817 కోట్ల నుంచి రూ.2,744 కోట్లకు కుదింపు..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు 2013 డిసెంబర్ నాటికి 10.24 లక్షల ఖాతాల్లో ఉన్న అన్ని రకాల వ్యవసాయ రుణాలూ రూ.6,817 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. ఇందులో పంట రుణాలు 6.08 లక్షల ఖాతాల పరిధిలో రూ.3,093 కోట్లు, బంగారు నగల తాకట్టుపై 2.12 లక్షల ఖాతాల పరిధిలో రూ.1,851 కోట్లు, వ్యవసాయ అనుబంధ టర్మ్‌లోన్లు 2.03 లక్షల ఖాతాల పరిధిలో 1,873 కోట్లు మాఫీ చేయాల్సి ఉండేది. కానీ నిబంధనలు, కమిటీల పేరుతో కాలయాపన చేసి రుణమాఫీ సొమ్ముపై కొర్రీల మీద కొర్రీలు వేసి చివరకు రూ.2,744 కోట్లకు కుదించారు. ఇదైనా సక్రమంగా చేశారా? అంటే అదీలేదు.
రైతులను అవస్థలపాలు చేసిన ప్రభుత్వం : విడతల వారీ, మాఫీ పత్రాల పేరుతో జాప్యం చేస్తూ నాలుగున్నరేళ్లు రైతులను ఇబ్బందుల పాలు చేశారు. రుణమాఫీ అనగానే రైతులు జడుసుకునేలా చేశారు. మాఫీ కోసం రైతులు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మండలాలు, డివిజన్ కేంద్రాలు, జిల్లా కేంద్రం, రాజధాని ప్రాంతాలతో పాటు బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన రైతులు వేలల్లో ఉన్నారు. మొదటి విడతగా రూ.1,068 కోట్లు, రెండో విడతగా రూ.460.90 కోట్లు, మూడో విడతగా రూ.502.80 కోట్లు ఇచ్చినా అందులో వేలాది మందికి వడ్డీకి కూడా సరిపోలేని పరిస్థితి కల్పించారు. రెండు, మూడో విడతల కింద ఇంకా రూ.33 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. ఇక 4, 5వ విడత సొమ్ము విడుదల చేయకుండా రెండేళ్లుగా కాలయాపన చేస్తూ వచ్చారు. రైతులను మభ్యపెట్టి మరోసారి ఎన్నికల్లో లబ్ధిపొందే ఎత్తుగడగా ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే 4, 5వ విడత రుణమాఫీ చెలిస్తామంటూ జీవో విడుదల చేశారు. 5.50 లక్షల మంది రైతులకు ఇప్పుడు నాలుగో విడతగా రూ.544.70 కోట్లు, ఐదో విడత కింద రూ.586.60 కోట్లు విడుదల కావాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న రూ.33 కోట్లను కలుపుకుంటే మాఫీ సొమ్ము రూ.1,164.20 కోట్లు విడుదల చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment