పోలవరం మేమే కడతాం
2019నాటికి పూర్తి చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
సాక్షి, విజయవాడ, అమరావతి: గోదావరి జలాలను 2018 నాటికి గ్రావిటీతో కృష్ణానదికి చేర్చడం, 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలు కృష్ణానదిలో కలిసే చోట చంద్రబాబు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కొంతమంది కాపర్ డ్యాంకు, మెయిన్ డ్యాంకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. చెరువులను గొలుసుకట్టుగా అనుసంధానం చేసి భూగర్భ జలాలను పెంచాలన్నారు. కంప చెట్లు, తుమ్మ చెట్లు తొలగించాలన్నారు. ఈ ఏడాది నాలుగు లక్షల పంటకుంటలు తవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు.
గోదావరి నీళ్లను సోమశిలకు మళ్లిస్తాం
ఈ ఏడాది ఎన్ని ఇబ్బందులు వచ్చినా గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు తెచ్చామని సీఎం చెప్పారు. కృష్ణా జలాలను నాగార్జునసాగర్ కుడికాల్వ ద్వారా రాయలసీమకు ఇచ్చి ఒక పంట కాపాడుకోగలిగామని చెప్పారు. రాబోయే రోజుల్లో గోదావరి జలాలు కృష్ణానదికి, అక్కడ నుంచి పెన్నానదికి తీసుకువెళ్లి సోమశిల ప్రాజెక్టు వరకు మళ్లిస్తామని చెప్పారు. కృష్ణా, గోదావరి డెల్టాల్లో నారుమళ్లు వేసుకుని పంటలు సకాలంలో పండించి తుపానుల బారిన పడకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు.
ఏటా 50 కోట్ల మొక్కలు నాటాలి: సీఎం
రాష్ట్రవ్యాప్తంగా జూలై 1వతేదీన ‘వనం మనం’ కార్యక్రమాన్ని కోటి మొక్కలు నాటి పెద్ద ఎత్తున నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. గుంటూరు జిల్లా కొండవీడు నుంచి ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కార్తీక మాసంలో జరిగే ‘వనమహోత్సవం’ వరకూ దీన్ని నిరాటంకంగా చేపట్టేందుకు మంత్రులతో పాటు అంతా బాధ్యత తీసుకోవాలని కోరారు.