ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదు: డీజీపీ
కిర్లంపూడి: రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ‘చలో అమరావతి’ పాదయాత్రకు ప్రభుత్వ అనుమతి లేదని ఏపీ డీజీపీ సాంబశివ రావు అన్నారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించిన చూస్తూ ఊరకోమన్నారు. ఆయతోపాటు ఎవరైనా పాదయాత్రల్లో ఎవరైనా పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కిర్లంపూడిలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ముద్రగడే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ముద్రగడకు సహకరించిన వారందరిపై కేసులు పెడతామన్నారు.
మరోవైపు తూర్పుగోదావరి వీరవరం వద్ద ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ అనుచరులకు పోలీసుల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. ఇందులో కాపు జేఏసీ సభ్యుడు వాసిరెడ్డి ఏసుదాసు కాలికి గాయం అయ్యింది. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న పద్మనాభాన్ని బలవంతంగా తీసుకెళ్లి బస్సులో కూర్చోపెట్టారు.
గత నెల 26న ముద్రగడ పాదయాత్ర చేయాల్సిఉంది. అయితే ప్రభుత్వ అనుమతి లేదనే నెపంతో పాదయాత్రను దాదాపు నెలరోజుల నుంచి ఏపీ సర్కార్ అడ్డుకుంటూ వస్తోంది. గాంధీమార్గంలో, శాంతియుతంగా పాదయాత్ర చేస్తామని ముద్రగడ చెబూతూ వచ్చినా ఆయన పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన్ను దాదాపు నెల రోజుల నుంచి పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముద్రగడ ఇంటి చుట్టూ కేంద్ర బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. కిర్లంపూడిలోకి బయట వ్యక్తులు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. అలాగే పలువురు కాపు నేతలను ముందస్తుగా గృహనిర్భందం చేశారు. దాదాపు నెల రోజుల నుంచి తూర్పు గోదావరి జిల్లాను సుమారు ఏడువేలమంది పోలీసులు దిగ్బంధం చేశారు.
అనంతరం ఆయన పలుసార్లు పాదయాత్ర ప్రయత్నాలు చేసినా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆగస్టు 19న పాదయాత్రను మరోసారి అడ్డుకోవడంతో మండిపడిన ముద్రగడ ప్రభుత్వం తనను ఇలా హింసిస్తున్నందుకు నిరసనగా ఏదో ఓ రోజు గోడ దూకి, ఎక్కడో ఓ చోట నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పారు. అన్నట్లుగానే ఆయన ఆదివారం పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారీగా మద్దతుదారులు, అభిమానులు తరలిరావడంతో పోలీసులను దాటుకొని ఇంటి నుంచి ముద్రగడ పాదయాత్రకు బయలుదేరారు. ఆయన వెంట భారీగా మద్దతుదారులు ఉండటంతో పోలీసులు కూడా చేతులు ఎత్తేశారు. దీంతో ముద్రగడ 'ఛలో క్లిరంపూడి'కి పిలుపునిచ్చారు. తన మద్దతుదారులంతా కిర్లంపూడి రావాలని, అక్కడి నుంచి 'ఛలో అమరావతి' పాదయాత్ర చేపడుదామని ముద్రగడ తన అనుచరులకు సూచించారు.
ఇంకా చదవండి: కిర్లంపూడిలో తీవ్ర ఉత్కంఠ