సాక్షి, అమరావతి: బహిరంగ మార్కెట్‌లో రూ.40 కోట్లు విలువ చేసే భూమి కేవలం రూ.50.05 లక్షలకే కేటాయింపు.. జాతీయ రహదారుల విస్తరణలో ఎకరం భూమి కోల్పోతే దానికి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉండగా అలా చేయకుండా అత్యంత ఖరీదైన చోట 1.5 ఎకరాలు కేటాయింపు.. జిల్లా కలెక్టర్ అభ్యంతరపెట్టినా ఖాతరు చేయని వైనం. ఇవీ.. గత ప్రభుత్వం ఆంధ్రజ్యోతి దినపత్రికకు నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా ఆర్థిక ప్రయోజనం కల్పించిందో చెప్పడానికి నిదర్శనాలు. జిల్లా కలెక్టర్, సీసీఎల్‌ఏలు కనీసం రూ.7.26 కోట్లకు కేటాయించాలని ప్రభుత్వానికి సూచించినా పెడచెవిన పెడుతూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అర ఎకరం భూమిని కేవలం రూ.5 వేలకు, మరో ఎకరం భూమిని రూ.50 లక్షలకు ఆంధ్రజ్యోతికి చెందిన ఆమోదా పబ్లికేషన్‌కు కేటాయించేశారు.
వ్యాపారం చేసుకునే సంస్థకు ప్రజాప్రయోజనాల పేరుతో అత్యంత ఖరీదైన భూమిని కారుచౌకగా కట్టబెట్టడంపై విశాఖ వాసి ఒకరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నేరుగా ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ వ్యవహారం బయటకొచ్చింది. విశాఖపట్నం నడిబొడ్డున మధురవాడలోని పరదేశీ పాలెంలో సర్వే నెంబర్లు 191/10–14 వరకు ఉన్న 1.5 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని తేలడంతో ప్రజాప్రయోజనాల దృష్టా ప్రభుత్వం ఈ భూకేటాయింపును రద్దు చేసింది.
అక్రమ వ్యవహారం ఇలా..
ఎన్‌హెచ్–5 విస్తరణలో భాగంగా ఆంధ్రజ్యోతికి చెందిన ఎకరం భూమిని 1986లో ప్రభుత్వం తీసుకుంది. దీనికి నష్టపరిహారంగా ఏకంగా 1.5 ఎకరాల విలువైన భూమిని కొట్టేయడానికి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కథ నడిపించారు. 2014లో చంద్రబాబు సీఎం కాగానే జిల్లా కలెకర్ట్‌కు విజ్ఞప్తి చేయించారు. సాధారణంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కోసం భూమిని సేకరించినప్పుడు నష్టపరిహారం ఇస్తుంది తప్ప బదులుగా ఖరీదైన ప్రాంతంలో అంతే పరిమాణంలో భూమి ఇవ్వదు. అయితే.. చంద్రబాబు ఏకంగా 1.5 ఎకరాల భూమిని కేటాయిస్తూ జూలై 28, 2017లో నిర్ణయం తీసుకున్నారు. ఆమోద పబ్లికేషన్ భూమి తీసుకొని రెండేళ్లు దాటినా ఇంతవరకు అక్కడ ఎటువంటి పనులూ ప్రారంభించలేదని, ఫిర్యాదు అందిన తర్వాత నోటీసులు జారీ చేయడంతోహడావిడిగా బుల్డోజర్లు, జేసీబీలు తీసుకొచ్చి చదును చేయడం ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ నివేదికలో పేర్కొనడంతో ప్రభుత్వం భూకేటాయింపును రద్దు చేసింది. (చదవండి: అక్రమ ఆమోదంపై వేటు)
Comments
Please login to add a commentAdd a comment