ఫలితాల్లోనూ రికార్డ్‌ | AP Grama Sachivalayam Results Declared | Sakshi
Sakshi News home page

ఫలితాల్లోనూ రికార్డ్‌

Published Fri, Sep 20 2019 4:27 AM | Last Updated on Fri, Sep 20 2019 2:40 PM

AP Grama Sachivalayam Results Declared - Sakshi

గురువారం సచివాలయ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స అధికారులు 

ఒకే విడతలో 1,34,524 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దేశ చరిత్రలో ఓ రికార్డు
నోటిఫికేషన్‌ జారీ చేసిన 35 రోజులకే రాత పరీక్షల నిర్వహణ.. మరో రికార్డు
21,69,529 మంది దరఖాస్తు చేసుకుంటే 19,50,582 మంది హాజరు.. సంచలనం
జాతీయ స్థాయి పరీక్షల్లో కూడా లేని రీతిలో లక్షల మంది హాజరైనా ప్రశాంతంగా, తప్పులు దొర్లకుండా, యూపీఎస్‌సీ తరహాలో నిర్వహణ.. ఇదీ రికార్డే
ఏ ఉద్యోగ రాతపరీక్షల ఫలితాలూ వెల్లడి కానంత వేగంగా.. పరీక్షలు పూర్తయిన 11 రోజులకే ఫలితాలు వెలువడటం మరో రికార్డు.
ఎన్నికలు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, చెప్పినవి అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వంద రోజుల పాలనలోనే చూపించిన చిత్తశుద్ధి ఇదీ..

సాక్షి, అమరావతి : మహాత్ముడు కలలుకన్న గ్రామ స్వరాజ్యం సాకారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ఫలితాల(మార్కులు)ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. 1,26,728 ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్షలకు 19,50,582 మంది హాజరు కాగా 1,98,164 మంది కనీస అర్హత మార్కులు సాధించి ఉత్తీర్ణులయ్యారు.

ఈనెల 1 నుంచి 8 వరకు 150 మార్కులకు రాతపరీక్షలు జరగగా ఓసీ అభ్యర్థులకు 60, బీసీలకు 52.5 .. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 చొప్పున కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు. పది శాతం మంది కనీస అర్హత మార్కులను సాధించగలిగారు. కనీస అర్హత మార్కులు తెచ్చుకున్న వారిలో సగం మందికిపైగా బీసీలే కావడం గమనార్హం. ఓసీ, బీసీ అభ్యర్ధులు గరిష్టంగా 122.5మార్కులు సాధించగా, ఎస్సీ అభ్యర్ధులు గరిష్టంగా 114, ఎస్టీ అభ్యర్ధులు గరిష్టంగా 108 మార్కులు సాధించారు. మార్కుల వివరాలను వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారు.

రేపటి నుంచి కాల్‌ లెటర్లు..
రాతపరీక్షల ఫలితాల్లో జిల్లాలవారీగా మెరిట్‌ జాబితాలను వర్గీకరించి ఆయా ప్రాంతాలకు పంపారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలోని జిల్లా సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ)లు పోస్టుల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్ల ప్రకారం మెరిట్‌ అభ్యర్ధులకు కాల్‌ లెటర్లు పంపిస్తాయి. ఎంపికైన వారికి శని, ఆదివారాల్లో కాల్‌ లెటర్లు అందుతాయి. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. 23, 24, 25వ తేదీల్లో జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు జిల్లా యంత్రాంగం నిర్దేశించిన చోట హాజరు కావాలి.

ఉత్తీర్ణుల సంఖ్య కేటగిరీలవారీగా..
ఓపెన్‌ -  24,583
బీసీ   - 1,00,494
ఎస్సీ  -  63,629
ఎస్టీ   -   9,458
పరీక్షకు హాజరైన అభ్యర్థులు  - 19,50,630 
ఉత్తీర్ణులు - 1,98,164  


కేటగిరీలవారీగా అభ్యర్థులు సాధించిన గరిష్ట మార్కులు
ఓపెన్‌ కేటగిరిలో అత్యధికంగా - 122.5  
బీసీ కేటగిరిలో అత్యధికంగా - 122.5   
ఎస్సీ కేటగిరిలో అత్యధికంగా - 114  
ఎస్టీ కేటగిరిలో అత్యధికంగా -108  
మహిళా అభ్యర్థుల్లో గరిష్టంగా - 112.5  
పురుష అభ్యర్థుల్లో  గరిష్టంగా - 122.5 
ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులకు 10% వెయిటేజ్‌ మార్కులు విడిగా కలిపారు.

వెరిఫికేషన్‌ షెడ్యూల్‌ 
వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్ల అప్‌లోడ్‌21.09.2019  నుంచి
కాల్‌ లెటర్ల జారీ21.09.2019 – 22.09.2019
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ సెప్టెంబర్‌ 23– 25
నియామక ఉత్తర్వుల జారీ - 27.09.2019
అవగాహన కార్యక్రమం - 1–2 అక్టోబర్‌ 2019
గ్రామ/వార్డు సచివాలయాల ప్రారంభం -  02.10.2019

కనీస అర్హత మార్కుల తగ్గింపు ఇప్పుడు లేనట్టే
సాక్షి, అమరావతి: సచివాలయాల ఉద్యోగాల భర్తీ విషయంలో కనీస అర్హత మార్కులు తగ్గింపుపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ‘సాక్షి’కి చెప్పారు. రాతపరీక్షల ఫలితాల వెల్లడి అనంతరం పలు జిల్లాల్లో వివిధ పోస్టుల సంఖ్య కన్నా రాతపరీక్షలలో వివిధ కేటగిరీల్లో కనీస అర్హత మార్కులు సాధించిన వారి సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంగీకరిస్తున్నారు. అయితే, జిల్లాలో భర్తీ చేసే పోస్టుల సంఖ్య కన్నా ఆ జిల్లాలో క్వాలిఫయింగ్‌ మార్కులు వచ్చిన వారు తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలన్న దానిపై 15 రోజుల తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

భర్తీ చేసే ఉద్యోగాలు ఎక్కువ ఉండి, కనీస మార్కులు తెచ్చుకున్న వారు తక్కువగా ఉన్నా ఇప్పుడు అర్హత మార్కులు తెచ్చుకున్న వారికే జిల్లా సెలక్షన్‌ కమిటీలు కాల్‌ లెటర్లు పంపడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పుడు షెడ్యూల్‌ ప్రకారం భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా వారీగా మిగిలి పోయే పోస్టుల సంఖ్యను సమీక్షించిన తర్వాత, ఆ పోస్టులకు తిరిగి నోటిఫికేషన్‌ జారీ చేయాలా.. లేదంటే ఇప్పుడు జరిగిన రాత పరీక్షల్లో మార్కులను తగ్గించి ఆ పోస్టులను భర్తీ చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తుదినిర్ణయం తీసుకుంటారన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement