సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో తొలిరోజు ఒక్కరోజే సుమారు15 లక్షల మందికి పైగా పరీక్షలకు హాజరవుతారని అధికారులు పేర్కొన్నారు. ఇక 3వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు జరిగే పరీక్షలను 6,19,812 మంది రాయనున్నారని తెలిపారు. కాగా, మొదటిరోజు మొత్తం 4,478 కేంద్రాల్లో రాతపరీక్షలు జరగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.144 సెక్షన్ విధించారు. ఆదివారం ఉదయం పంచాయతీ సెక్రటరీ గ్రేడ్–5, మహిళా పోలీసు, సంక్షేమ విద్యా కార్యదర్శి( గ్రామీణ), వార్డు పరిపాలనా కార్యదర్శి ఉద్యోగాలకు పరీక్షలు జరుగుతున్నాయి.
ఇక మధ్యాహ్నం 2:30 గంటల నుంచి పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-6 ఉద్యోగాలకు పరీక్ష జరుగుతుంది. పరీక్షలు రాసే అభ్యర్థులు గంటముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని, నిముషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ప్రతిజిల్లాలోను ఆర్టీసీ 500 బస్సులను అందుబాటులో ఉంచింది. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో అభ్యర్థుల సహాయార్థం ప్రభుత్వం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసింది. కాగా, పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 2 నుంచి విధుల్లో చేరనున్నారు.
పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల సందేహాల నివృత్తికి రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ ఫోను నెంబర్లు : 9121296051, 9121296052, 9121296053, 9121296054, 9121296055
Comments
Please login to add a commentAdd a comment