Written examination
-
‘సచివాలయ’ పరీక్షలు.. తప్పు ప్రశ్నలకు మార్కులు
సాక్షి, అమరావతి: ఈనెల ఒకటో తేదీ ఉదయం జరిగిన కేటగిరి–1 ‘సచివాలయ’ ఉద్యోగాల రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ రెండు మార్కులు కలపాలని అధికారులు నిర్ణయించారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5, మహిళా పోలీసు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ.. ఇలా మొత్తం నాలుగు రకాల పోస్టులకు కలిపి నిర్వహించిన ఒకే పరీక్షలో రెండు ప్రశ్నలలో తప్పులు దొర్లడంతో వాటికి కేటాయించిన మార్కులను ఆ రోజు పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ కలపాలని నిర్ణయించారు. 4,465 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు మొత్తం 11,62,164 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించి ఫైనల్ ‘కీ’ని అధికారులు శనివారం విడుదల చేశారు. ఏ–సిరీస్ ప్రశ్నపత్రంలో 47, 98 ప్రశ్నలకు.. బీ–సిరీస్ ప్రశ్నపత్రంలో 30, 84 ప్రశ్నలకు.. సీ– సిరీస్ ప్రశ్నపత్రంలో 13, 147 ప్రశ్నలకు.. డీ–సిరీస్ ప్రశ్నపత్రంలో 3, 118 ప్రశ్నలకు పూర్తి మార్కులు కలుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇవి కాకుండా.. పరీక్ష జరిగిన రోజు ప్రకటించిన ప్రాథమిక ‘కీ’పై అభ్యర్థుల నుంచి వినతులు రావడంతో అందులోని ఒక ప్రశ్నకు సంబంధించిన జవాబును కూడా ఫైనల్ ‘కీ’లో మార్చారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ పరీక్షకు 86.83 శాతం హాజరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు శనివారం జరిగిన పరీక్షకు 86.63 శాతం మంది హాజరయ్యారు. గ్రామ, పట్టణ వార్డు సచివాలయాల్లో కలిపి మొత్తం 14,759 ఉద్యోగాలకు 1,33,832 మంది దరఖాస్తు చేసుకోగా, శనివారం జరిగిన పరీక్షకు 1,16,208 మంది హాజరయ్యారు. అలాగే, సాయంత్రం 400 విలేజీ సెరికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జరిగిన పరీక్షకు 5,047 మందికి గాను 4,034 మంది హాజరయ్యారు. ‘డిజిటల్ అసిస్టెంట్’ అభ్యర్థులకు కూడా.. సెప్టెంబర్ 1న జరిగిన డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాల ప్రశ్నపత్రంలోనూ 2 ప్రశ్నలలో తప్పులు దొర్లడంతో ఆ పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ కూడా 2 మార్కులు కలపాలని అధికారులు నిర్ణయించారు. ఈ పరీక్ష ఫైనల్ ‘కీ’ని కూడా శనివారం రాత్రి ప్రకటించారు. ఎ–సిరీస్‌లో 57, 72 ప్రశ్నలకు.. బి–సిరీస్‌లో 56, 141, సి–సిరీస్‌లో 118, 133, డి–సిరీస్‌లో 77, 92 ప్రశ్నలకు పూర్తి మార్కులు కేటాయిస్తారు.అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు ప్రాథమిక కీలో పేర్కొన్న 7 ప్రశ్నల సమాధానాలను ఫైనల్ కీలో మార్చారు. వీటిలో 5 ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల్లో రెండేసి సమాధానాలున్నట్లు అధికారులు గుర్తించారు. అభ్యర్థులు ఈ రెండింటిలో ఏది జవాబుగా పేర్కొన్నా మార్కులివ్వనున్నట్లు ఫైనల్ ‘కీ’లో పేర్కొన్నారు. -
ముగిసిన తొలిరోజు ‘సచివాలయ’ పరీక్షలు
-
ముగిసిన తొలిరోజు ‘సచివాలయ’ పరీక్షలు
సాక్షి, అమరావతి : గ్రామ సచివాలయ ఉద్యోగ తొలి రోజు పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో తొలిరోజు ఒక్కరోజే 11,58,538 మంది హాజరు కాగా, 95,436 మంది గైర్హాజరు అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 92.50శాతం మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. విజయనగరంలో 93.60, శ్రీకాకుళం 93.47, పశ్చిమ గోదావరి 93.46, తూర్పు గోదావరి 92.71, విశాఖపట్నం 92.48, కృష్ణా 89.36, గుంటూరు 91.73, ప్రకాశం 91.56, నెల్లూరు 93.05, చిత్తూరు 93.21, కర్నూలు 91.97, వైఎస్సార్ జిల్లా 93.21, అనంతరపురం 92.67శాతం హాజరు నమోదైందని అధికారులు వెల్లడించారు. -
‘సచివాలయ’ రాత పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో తొలిరోజు ఒక్కరోజే సుమారు15 లక్షల మందికి పైగా పరీక్షలకు హాజరవుతారని అధికారులు పేర్కొన్నారు. ఇక 3వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు జరిగే పరీక్షలను 6,19,812 మంది రాయనున్నారని తెలిపారు. కాగా, మొదటిరోజు మొత్తం 4,478 కేంద్రాల్లో రాతపరీక్షలు జరగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.144 సెక్షన్ విధించారు. ఆదివారం ఉదయం పంచాయతీ సెక్రటరీ గ్రేడ్–5, మహిళా పోలీసు, సంక్షేమ విద్యా కార్యదర్శి( గ్రామీణ), వార్డు పరిపాలనా కార్యదర్శి ఉద్యోగాలకు పరీక్షలు జరుగుతున్నాయి. ఇక మధ్యాహ్నం 2:30 గంటల నుంచి పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-6 ఉద్యోగాలకు పరీక్ష జరుగుతుంది. పరీక్షలు రాసే అభ్యర్థులు గంటముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని, నిముషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ప్రతిజిల్లాలోను ఆర్టీసీ 500 బస్సులను అందుబాటులో ఉంచింది. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో అభ్యర్థుల సహాయార్థం ప్రభుత్వం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసింది. కాగా, పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 2 నుంచి విధుల్లో చేరనున్నారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల సందేహాల నివృత్తికి రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ ఫోను నెంబర్లు : 9121296051, 9121296052, 9121296053, 9121296054, 9121296055 -
ఎస్ఐ రాత పరీక్ష వాయిదా పడేనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో నిర్వహించబోయే సబ్–ఇన్స్పెక్టర్ రాత పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. మొన్నటిదాకా సాధారణ నిరుద్యోగులు మాత్రమే ఈ విషయంపై పలుమార్లు డీజీపీకి వినతిపత్రాలు సమర్పించారు. ఇపుడు ఇదే విషయంపై సొంత డిపార్ట్మెంట్లోనే తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికే డిపార్ట్మెంట్లో ఉన్న పలువురు కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఎస్.ఐ పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. శారీరక పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న వీరంతా ఏప్రిల్ 20న నిర్వహించబోయే రాతపరీక్షలో మంచి మార్కులు సాధించి ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. కానీ ఇదే సమయంలో ఎన్నికలు రావడం, వెంటనే విధులకు రావాలని డీజీపీ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో పరీక్ష రాసే అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. తక్కువ సమయం ఉందంటున్నా.. తెలంగాణలో ఎన్నికలు రావడం, ఇదే సమయంలో ఎస్.ఐ అభ్యర్థులకు రాతపరీక్షలు నిర్వహిస్తుండటం సమస్యకు కారణమవుతోంది. వాస్తవానికి తెలంగాణ 33 జిల్లాల్లో పలు బెటాలియన్లు, పోలీస్స్టేషన్లలో పనిచేస్తోన్న హోంగార్డులు, కానిస్టేబుళ్లలో 30 ఏళ్లలోపు వారు వేలల్లో ఉన్నారు. వీరంతా ఎస్.ఐ ఉద్యోగానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. అసలే వారాంతపు సెలవులు కూడా దొరకని ఉద్యోగం కావడంతో పగలంతా కష్టపడి, ఏరాత్రికో ఇంటికి చేరుకుని దొరికిన సమయంలో చదువుకుంటున్నారు. అయితే, తమ భవిష్యత్తుకు ఇదే ఆఖరు అవకాశమనుకున్న ఇంకొందరు పంచాయతీ ఎన్నికల తరువాత నుంచి విధులకు హాజరుకావడం లేదు. వీరికి ఇప్పటికే ఉన్నతాధికారులు పలుమార్లు నోటీసులు పంపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరికీ సెలవులు ఇవ్వడంలేదని, సిబ్బంది తక్కువగా ఉన్న కారణంగా వెంటనే రిపోర్టు చేయాలని చెబుతున్నారు. ఇదే విషయమై వారి తల్లిదండ్రులకు ఫోన్లో కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. ఏప్రిల్ 1వ తేదీలోగా విధుల్లో చేరాలంటూ వారందరికీ నోటీసుల్లో స్పష్టంచేశారు. సొంత డిపార్ట్మెంటే కరుణించకపోతే ఎలా? డిపార్ట్మెంట్లో చాలామంది హోంగార్డులు, కానిస్టేబుళ్లు ఈసారి ఎలాగైనా ఎస్.ఐ పోస్టు సాధించాలన్న కసితో చదువుతున్నారు. అలాంటిది ప్రిపరేషన్ కోసం సెలవులు ఇవ్వకపోతే ఎలా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పీజీలు, పీహెచ్డీ చేసిన వారు కూడా కానిస్టేబుళ్లు, హోంగార్డులుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగమన్న భరోసాతో జీతం తక్కువైనా పనిచేస్తున్నారు. లేకలేక వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు సొంత డిపార్ట్మెంట్ నుంచి సహకారం లేకపోవడం వారిని తీవ్ర వేదనకు గురిచేస్తోంది. మరోవైపు ఏప్రిల్ 14 ఆర్మ్డ్ రిజర్వ్డ్ (ఏఆర్) కానిస్టేబుళ్లకు పదోన్నతికి సంబంధించిన శిక్షణ కూడా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో తమకు చదువుకునేందుకు సమయం లేదని ఏప్రిల్ 11న ఎన్నికలు అప్పటివరకు బందోబస్తు, 14న పదోన్నతి శిక్షణ, 20, 21న ఎస్.ఐ రాతపరీక్షలు ఉండటంతో తమకు తక్కువ సమయం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి కూడా పరీక్షను కనీసం నెలరోజులపాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వయోపరిమితి దాటిపోతున్న నేపథ్యంలో ఎస్.ఐ కావాలని కలలు కంటున్న సిబ్బంది ఆకాంక్షలకు అనుగుణంగా పరీక్షను వాయిదా వేయాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును కోరుతున్నారు. వాయిదాకు బోర్డు ససేమిరా.. ఈ నేపథ్యంలో పోలీసు నియామక బోర్డు మాత్రం పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది. ఇప్పటికే శారీరక పరీక్షలను దాదాపుగా పూర్తి చేసిన బోర్డు 2.16 లక్షల మందికి ఫలితాలను ప్రకటించింది. పరీక్ష నిర్వహణలో ఎలాంటి జాప్యం ఉండదని ఇప్పటికే పలుమార్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. -
ఎస్జీటీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల రాత పరీక్షల ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. 8 మీడియాలకు సంబంధించిన 82,537 మంది అభ్యర్థుల ర్యాంకులను ప్రకటిం చింది. వాటిని తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. హాల్‌టికెట్ నంబర్, బుక్లెట్ సిరీస్ వంటి వాటికి సంబంధించి తప్పుడు బబ్లింగ్ చేసిన వారిని రిజెక్ట్ చేశామని, మెరిట్ జాబితాలో చేర్చలేదని పేర్కొంది. కోర్టును ఆశ్రయించి, జాబితాలో చేర్చాలని కోర్టు ఇచ్చిన వారి పేర్లను మాత్రమే చేర్చామని వెల్లడించింది. కోర్టు తుది తీర్పునకు లోబడి వారి ర్యాంకింగ్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. రెండు, మూడు రోజుల తర్వాత జిల్లాల వారీగా ఆయా కేటగిరీల్లో పోస్టులకు 1:3 రేషియోలో అభ్యర్థుల మెరిట్ జాబితాలను ప్రకటించేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం టీచర్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నందున జిల్లాల్లో వెరిఫికేషన్ చేపట్టే పరిస్థితి లేదని విద్యాశాఖ ఇప్పటికే తెలిపింది. వెరిఫికేషన్‌కు 1:3 రేషియోలో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి ఉంచాలని, వారు ఎప్పుడు అడిగితే అప్పుడు జిల్లా కలెక్టర్లకు పంపించేలా టీఎస్పీఎస్సీ సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల వివరాలిలా.. మీడియం అభ్యర్థులు తెలుగు 52,452 ఇంగ్లిష్ 27,924 ఉర్దూ 2,033 కన్నడ 54 మరాఠీ 44 హిందీ 28 బెంగాళీ 1 తమిళ్ 1 -
ఏఎన్ఎం రాతపరీక్షల్లో మాల్ ప్రాక్టీస్?
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్:హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ (ఏఎన్ఎం)ల వార్షిక పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఉన్న ఐదు ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో చదువుతున్న 190 మంది ఏఎన్ఎం అభ్యర్థులకు మంగళవారం స్థానిక మహిళ ప్రాంగణంలో నిర్వహించారు. 190 మందికి గాను 11 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అభ్యర్థులు ఏకంగా గైడులు, స్లిప్పులు తెచ్చుకుని దర్జాగా పరీక్షలు రాస్తున్నారని తెలిసింది. దీనికి ఇన్విజిలేటర్లు సైతం సహకరించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. పరీక్ష కేంద్రానికి పాత్రికేయులు వస్తున్నారనే సమాచారం తెలియడంతో ఇన్విజిలేటర్లు అభ్యర్థుల నుంచి గైడులు, స్లిప్పులు తీసుకుని టేబుల్ కింద దాచేశారు. మరో కేంద్రంలో కుర్చీలు కింద దాచేశారు. వాటిని ఎందుకు ఉంచారనే విషయం కూడా ఇన్విజిలేటర్లు చెప్పడం లేదు.ఇదే విషయాన్ని పరీక్ష కేంద్రం పర్యవేక్షకులు వైద్య ఆరోగ్యశాఖ డిస్ట్రిక్ ట్రైనింగ్ టీమ్ పి.ఓ ప్రభాకరరావు వద్ద ప్రస్తావించగా టేబుల్, కుర్చీ కింద గైడులు, స్లిప్పులు దాచిని విషయం తెలియదని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.