ఏఎన్‌ఎం రాతపరీక్షల్లో మాల్ ప్రాక్టీస్?
Published Wed, Dec 4 2013 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్:హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ (ఏఎన్‌ఎం)ల వార్షిక పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఉన్న ఐదు ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో చదువుతున్న 190 మంది ఏఎన్‌ఎం అభ్యర్థులకు మంగళవారం స్థానిక మహిళ ప్రాంగణంలో నిర్వహించారు. 190 మందికి గాను 11 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అభ్యర్థులు ఏకంగా గైడులు, స్లిప్పులు తెచ్చుకుని దర్జాగా పరీక్షలు రాస్తున్నారని తెలిసింది. దీనికి ఇన్విజిలేటర్లు సైతం సహకరించారని ఆరోపణలు కూడా ఉన్నాయి.
పరీక్ష కేంద్రానికి పాత్రికేయులు వస్తున్నారనే సమాచారం తెలియడంతో ఇన్విజిలేటర్లు అభ్యర్థుల నుంచి గైడులు, స్లిప్పులు తీసుకుని టేబుల్ కింద దాచేశారు. మరో కేంద్రంలో కుర్చీలు కింద దాచేశారు. వాటిని ఎందుకు ఉంచారనే విషయం కూడా ఇన్విజిలేటర్లు చెప్పడం లేదు.ఇదే విషయాన్ని పరీక్ష కేంద్రం పర్యవేక్షకులు వైద్య ఆరోగ్యశాఖ డిస్ట్రిక్ ట్రైనింగ్ టీమ్ పి.ఓ ప్రభాకరరావు వద్ద ప్రస్తావించగా టేబుల్, కుర్చీ కింద గైడులు, స్లిప్పులు దాచిని విషయం తెలియదని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Advertisement