పోలవరం పనులకు తొలగిన అడ్డంకి | AP High Court Issues Green Signal For Construction Of Polavaram Project | Sakshi
Sakshi News home page

తొలగిన అడ్డంకి

Published Fri, Nov 1 2019 4:26 AM | Last Updated on Fri, Nov 1 2019 11:04 AM

AP High Court Issues Green Signal For Construction Of Polavaram Project  - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు(పీహెచ్‌ఈపీ) పనులను థర్డ్‌ పార్టీకి అప్పగించేందుకు అడ్డుగా ఉన్న ఉత్తర్వులను హైకోర్టు తొలగించింది. రివర్స్‌ టెండరింగ్‌ కింద 17.08.19న జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ప్రాజెక్టు పనులను థర్డ్‌ పార్టీకి అప్పగించే ప్రక్రియను మొదలుపెట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను గురువారం ఎత్తేసింది. థర్డ్‌ పార్టీకి పనులను అప్పగించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న అభ్యర్థనతో నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌(ఐఏ)ను కొట్టేసింది.

ఇదే సమయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేయాలని కోరుతూ ఏపీ జెన్‌కో దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించింది. జలవిద్యుత్‌ ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ నవయుగ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌కు విచారణార్హత లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు సంబంధించి తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ నవయుగ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం తెలిసిందే.

ఒప్పందం రద్దు ఉత్తర్వుల అమలును నిలిపేయడంతోపాటు ప్రాజెక్ట్‌ పనులను థర్డ్‌ పార్టీకి అప్పగించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ మధ్యంతర పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నవయుగ కోరిన విధంగా గత ఆగస్టు 22న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రాజెక్ట్‌ పనులను థర్డ్‌ పార్టీకి అప్పగించే విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ జెన్‌కో మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసింది.

ఆ వ్యాజ్యానికి విచారణార్హత లేదు..
ఈ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ సీతారామమూర్తి గురువారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో మధ్యవర్తిత్వ క్లాజు ఉందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో గుర్తు చేశారు. ఈ ఒప్పందంలో మధ్యవర్తిత్వ క్లాజు ఉన్నప్పటికీ.. దాని జోలికెళ్లకుండా హైకోర్టులో అధికరణ 226 కింద పిటిషన్‌ దాఖలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఒప్పందంలో మధ్యవర్తిత్వ క్లాజు ఉన్న నేపథ్యంలో, ఈ న్యాయస్థానం కూడా ఆ క్లాజువైపే మొగ్గు చూపుతోందన్నారు.

ఈ మొత్తం వ్యవహారం మధ్యవర్తిత్వానికి సంబంధించిందని, అందువల్ల ఒప్పందం రద్దును సవాలు చేస్తూ నవయుగ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఒప్పందం రద్దు ఉత్తర్వుల అమలు నిలుపుదలకు.. ప్రాజెక్టు పనులను థర్డ్‌ పార్టీకి అప్పగించకుండా ఆదేశాలివ్వాలన్న మధ్యంతర పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో పనుల అప్పగింతకు సంబంధించి గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు.

బ్యాంకు గ్యారెంటీ కేసులోనూ...
ఇదిలా ఉంటే, పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు విషయంలో నవయుగ సమర్పించిన బ్యాంకు గ్యారెంటీలను నగదుగా మార్చుకోరాదంటూ అటు బ్యాంకులను, ఇటు జెన్‌కోను ఆదేశిస్తూ విజయవాడ కోర్టు ఆగస్టు 13న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. విజయవాడ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ జెన్‌కో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. బ్యాంకు గ్యారెంటీల విషయంలో మధ్యవర్తిత్వ చట్టం కింద నవయుగ దాఖలు చేసిన ఆర్బిట్రేషన్‌ ఓపీని రెండు వారాల్లో తేల్చాలని విజయవాడ 8వ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జిని ఆదేశించింది. అప్పటివరకు బ్యాంకు గ్యారెంటీల విషయంలో యథాతథస్థితి(స్టేటస్‌కో)ని కొనసాగించాలంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, జస్టిస్‌ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement