ఏపీలో గ్రామీణ ఘాట్‌లకు పోటెత్తిన భక్తులు
పశ్చిమ గోదావరివైపు తరలిన భక్తజనం
* పలచబడ్డ వీఐపీలు.. వీవీఐపీలు
* రాజమండ్రిలో తగ్గిన భక్తుల రద్దీ
* పుష్కరఘాట్ తొక్కిసలాట దుర్ఘటన ప్రభావం
సాక్షి, రాజమండ్రి, కొవ్వూరు: పుష్కరాల తొలి రోజున రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ప్రభావం రెండోరోజు కనిపించింది. రాజమండ్రికి భక్తుల తాకిడి అనూహ్యంగా తగ్గింది.
తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకూ ఘాట్లు కాస్త రద్దీగా కనిపించాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మెజార్టీ ఘాట్ల వద్ద రద్దీ పెద్దగా కనిపించలేదు. రాజమండ్రి పరిసర ప్రాంతాల ఘాట్లకు భక్తుల తాకిడి తగ్గినా.. గ్రామీణ ఘాట్లకు జనం భారీగానే తరలి వెళ్లారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఘాట్ల వైపు మొగ్గుచూపారు. అలాగే బుధవారం అమావాస్య కావడంతో పుణ్యస్నానాలకు వచ్చే భక్తుల సంఖ్య కాస్త తగ్గింది.
తొలి రోజు పుష్కరఘాట్‌లో సుమారు 3.5 లక్షల మంది, కోటిలింగాల రేవులో 4.2 లక్షల మంది స్నానమాచరించగా, రెండోరోజు ఆ సంఖ్య 2 లక్షలలోపే ఉందని తెలుస్తోంది. మొత్తమ్మీద బుధవారం సాయంత్రానికి అందిన సమాచారం మేరకు జిల్లా పరిధిలో సుమారు 12 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. వీరిలో నగర పరిధిలో 6.58 లక్షల మంది, గ్రామీణ ఘాట్‌లలో 5.40 లక్షల మంది స్నానాలు చేశారు. తొక్కిసలాట నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి వరకూ సీఎం, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులంతా ఘాట్ల వద్దే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు.
ప్రముఖులు కొందరే..
రాజమండ్రి వీఐపీ ఘాట్‌కు తొలి రోజుతో పోలిస్తే వీఐపీలు, వీవీఐపీల తాకిడి తగ్గింది. సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సిసోడియా, ఎంపీ వి.హనుమంతరావు, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పుణ్యస్నానాలు ఆచరించారు.
‘పశ్చిమ’కు జన వరద
పశ్చిమగోదావరి జిల్లాకు భక్తుల రాక పెరిగింది. కొవ్వూరు గోష్పాదం ఘాట్‌లో బందోబస్తు, పోలీసు భద్రతా పరిస్థితిని ఏపీ డీజీపీ జేవీ రాముడు పరిశీలించారు. ఏపీ మంత్రి పి.మాణిక్యాలరావు కొవ్వూరులోని పుష్కర ఘాట్లను పరిశీలించారు. రెండో రోజు జిల్లాలోని 97 ఘాట్లలో 10.86 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. కొవ్వూరు, నరసాపురం పట్టణాల్లో పోలీసు యంత్రాంగం డ్రోన్ కెమెరాల సాయంతో నిరంతర నిఘా కొనసాగించారు.
నరసాపురంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేత, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పుణ్యస్నానమాచరించి, పితృదేవతలకు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు.