సాక్షి, హైదరాబాద్: ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ పారదర్శకతకు దోహదపడాల్సిన సమాచారశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆ శాఖ 2016 సంవత్సరానికి ముద్రించిన టెలిఫోన్ డెరైక్టరీ తప్పుల తడకగా ఉంది. ప్రస్తుతం పదవుల్లో లేని వారి పేర్లను ముద్రించడం పట్ల పలువురు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆ పదవుల్లో ఎవరున్నారో కూడా తెలుసుకోకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవారి పేర్లనే డెరైక్టరీలో ప్రచురించడం చూస్తుంటే సమాచారశాఖ పనితీరేంటో అర్థమవుతోందని పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 20 సూత్రాల అమలు కార్యక్రమ చైర్మన్‌గా ఎన్.తులసిరెడ్డిని నియమించారు. ఆయన ఇంకా పదవిలో కొనసాగుతున్నట్లు టెలిఫోన్ డెరైక్టరీలో సమాచారశాఖ ప్రచురించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆ కార్యక్రమ చైర్మన్‌గా శేషసాయిబాబును నియమించారు.
వీరి పేర్లూ మార్చలేదు..
ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పనిచేసిన తిరుమలగిరి సుందర్ ఇంకా ఆ పదవిలో ఉన్నట్లు ముద్రించారు. ఆయన స్థానంలో వాసుదేవ దీక్షితులును గతేడాది నవంబర్ 30న ప్రభుత్వం నియమించింది. సాధారణ పరిపాలనశాఖలో ప్రొటోకాల్ డెరైక్టర్‌గా ఎన్వీ రమణారెడ్డి కొనసాగుతున్నట్లు ముద్రించారు. ఈయన ఇండియన్ రైల్వేస్‌కు వెళ్లి నెలలు గడిచాయి. ప్రస్తుతం ఆ పదవిలో అశోక్‌బాబు ఉన్నారు. ఇంకా విచిత్రమేమిటంటే.. ఏపీ జెన్‌కో చైర్మన్‌గా మృత్యుంజయ సాహూ, ఏపీ ట్రాన్స్‌కో చైర్మన్‌గా సురేశ్‌చందా పనిచేస్తున్నట్లు ప్రచురించారు. సురేశ్‌చందా తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఆర్థికశాఖ నుంచి కొన్ని నెలల కిందటే బదిలీ అయిన ఎల్.ప్రేమచంద్రారెరడ్డి ఇంకా ఆర్థికశాఖలోనే కొనసాగుతున్నట్లు ఉంది. కొత్త సంవత్సర టెలిఫోన్ డెరైక్టరీని ఇన్ని తప్పులతో ప్రచురించడం గమనార్హం.
పోస్టుస్థాయి దిగజార్చిన సీఎం..
సమాచార శాఖ కమిషనర్‌గా ఐఏఎస్ కేడర్ వ్యక్తి ఉండేవారు. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక ఈ పోస్టు స్థాయిని దిగజార్చారు. కొన్ని రోజులు ఇండియన్ రైల్వే సర్వీసుకు చెందిన ఎన్.రమణారెడ్డికి సమాచారశాఖ కమిషనర్‌గా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. రమణారెడ్డిని ఇండియన్ రైల్వే సర్వీసుకు తిరిగి పంపేశాక సమాచారశాఖ కమిషనర్‌గా గ్రూప్-1 అధికారి కృష్ణమోహన్‌ను నియమించారు. ఇలా సమాచారశాఖ పనితీరు అధ్వానంగా తయారైంది.
హవ్వా.. ఇదేం విడ్డూరం!
Published Wed, Jan 13 2016 8:35 PM | Last Updated on Thu, Mar 28 2019 5:34 PM
Advertisement
Advertisement