ఎంత భూమైనా ఇస్తాం | AP launches Industry Mission 2015-20, targets Rs 12.5 lakh cr | Sakshi
Sakshi News home page

ఎంత భూమైనా ఇస్తాం

Published Thu, Apr 30 2015 3:15 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

ఎంత భూమైనా ఇస్తాం - Sakshi

ఎంత భూమైనా ఇస్తాం

ఏపీలో పెట్టుబడులు పెట్టండి  
పారిశ్రామికవేత్తలకు సీఎం పిలుపు
ప్రభుత్వ ‘పారిశ్రామిక మిషన్’ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
47 సంస్థలతో రూ.35,745 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘పారిశ్రామికవేత్తలకు కావాల్సినంత భూమి ఇస్తాం. అందుకోసం రైతుల నుంచి మిలియన్ ఎకరాలు సేకరిస్తాం. నిరంతరాయంగా విద్యుత్ ఇస్తాం. కావాల్సినంత నీరిస్తాం. పరిశ్రమలకు భూమి, విద్యుత్, నీరు దేశంలో మరే రాష్ట్రం ఇవ్వనంతగా మేమిస్తాం.

మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు  పారిశ్రామికవేత్తలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక మిషన్‌ను ఆయన విశాఖపట్నంలో బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వ పారిశ్రామిక, సింగిల్ డెస్క్, బయోటెక్నాలజీ, ఆటోమొబైల్, ఫుడ్‌ప్రాసెసింగ్ విధానాలను ఆవిష్కరించారు. పరిశ్రమలకు అన్ని అనుమతులను 21 రోజుల్లో ఇచ్చేలా సింగిల్ డెస్క్ పోర్టల్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో రూ.35,745 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు 47 సంస్థలతో ప్రభుత్వం ఈ సందర్భంగా ఎంవోయూ కుదుర్చుకుంది.

తద్వారా 72,210 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించింది. ఏసియన్ పెయింట్స్, ఓఎన్‌జీసీ, క్రిబ్‌కో, కర్లాన్ సంస్థలకు భూకేటాయింపు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెద్దఎత్తున రైతుల నుంచి మిలియన్ ఎకరాలను సేకరించి పారిశ్రామికవేత్తలకోసం ల్యాండ్‌బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసేవారికి 10 వేల ఎకరాల వరకు భూములు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

నదుల అనుసంధానం ప్రక్రియలో భాగంగా గోదావరి నుంచి 500 టీఎంసీల నుంచి వెయ్యి టీఎంసీల వరకు నీటిని ఇతర నదులకు మళ్లిస్తామని సీఎం చెప్పారు. ఆ నీటిని పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తామన్నారు. ఇలా పారిశ్రామికవేత్తలు కోరినంత భూమి, విద్యుత్, నీరు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
 
ఆందోళనలు లేకుండా చేస్తాం..
రాష్ట్రంలో అపారంగా ఉన్న సహజ వనరులు కేజీ బేసిన్, బాక్సైట్, బెరైటీస్, బొగ్గు, బీచ్‌శాండ్, లైమ్‌స్టోన్ నిక్షేపాలను వెలికితీసే పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని సీఎం చెప్పారు.  పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో కార్మికవర్గాల ఆందోళనలు లేకుండా చేస్తామని సీఎం స్పష్టం చేశారు. 2020 నాటికి రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం, 10 లక్షలమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో విస్తృత అవకాశాలు
జపాన్-ఇండియా ఎనర్జీ ఫోరం 2015లో బాబు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదే శ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలున్నాయని, ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని జపాన్-ఇండియా ఎనర్జీ ఫోరం-2015లో ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘స్మార్ట్ కమ్యూనిటీ, క్లీన్ కోల్ టెక్నాలజీ’ అంశంపై ఢిల్లీలో బుధవారం ఓ హోటల్‌లో నిర్వహించిన సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. జపాన్ ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక వనరులతోపాటు విస్తృతమైన అవకాశాలున్నాయని వివరించారు.

సదస్సునుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్’తో ముందుకు వెళుతోందన్నారు. ‘నేను ఇక్కడికి ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేయడానికి వచ్చాను. జపాన్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నాయి. వాటిని ఒక్కటే కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్‌ను మీ రెండో ఇల్లుగా భావించండి’ అని అన్నారు. సదస్సు అనంతరం సీఎం జపాన్ పారిశ్రామిక శాఖ మంత్రి యోచి మియాజావాతో భేటీ అయ్యారు. జపాన్ పారిశ్రామికవేత్తలతోనూ వ్యక్తిగతంగా చర్చించారు.
 
నేడు స్వచ్ఛ్‌భారత్ అభియాన్‌కి హాజరు
ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసిన స్వచ్ఛ్‌భారత్ అభియాన్ సబ్ గ్రూప్ సమావేశంలో  చంద్రబాబు పాల్గొంటారు.
 
ఇవీ ఒప్పందాలు..

సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబు  బుధవారం పారిశ్రామిక మిషన్‌ను ప్రారంభించిన సందర్భంగా.. రాష్ట్రంలో రూ.35,745 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు దేశ, విదేశాలకు చెందిన 47 సంస్థలతో ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది.
హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) విశాఖ రిఫైనరీ విస్తరణకు రూ.17వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మాంగనీస్ ఓర్ మైనింగ్ అండ్ ఎక్స్‌ప్లొరేషన్‌కు ఏపీఎండీసీ-ఆర్‌ఐఎన్‌ఎల్ రూ.4 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
చిత్తూరులో రూ.900 కోట్లతో కార్ల తయారీ ప్లాంటును నెలకొల్పడానికి ఇసుజీ కంపెనీ ఒప్పందం చేసుకుంది.
ట్రెడెంట్ గ్రీన్‌టెక్ బయోటెక్నాలజీ తూర్పుగోదావరి జిల్లాలో రూ.900 కోట్ల పెట్టుబడికి ఎంఓయూ కుదుర్చుకుంది.
ఇంకా గౌతం బుద్ధ జౌళి పార్కు గుంటూరులో రూ.571 కోట్లు, సుజ్‌లాల్ ఎనర్జీ విండ్ టర్బైన్స్ ఏర్పాటుకు రూ.350 కోట్లు, ఏపీఎండీసీ-ఓఎన్‌జీసీ కడపలో ఖనిజాధార పరిశ్రమకు రూ.100 కోట్లు, నితిన్‌గ్రూప్ ఇండస్ట్రీస్ చిత్తూరులో ఆహారశుద్ధి పరిశ్రమలకు రూ.70 కోట్లు, వెం టెక్నాలజీస్ రక్షణ, విమానయాన రంగాల అభివృద్ధికి పశ్చిమగోదావరిలో రూ.2వేల కోట్లు, జైరాత్ ఇస్పాత్ కర్నూలులో రూ.3వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ, తేజా సిమెంట్స్ కడపలో రూ.1,500 కోట్లతో, ఎంపీఎల్ మినరల్ కర్నూలులో రూ.1000 కోట్లతో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు కుదిరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement