
మెడికల్ హబ్‌గా ఏపీ
⇒ ఎండోకాన్-2015 జాతీయ సదస్సులో సీఎం చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ను మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అంతర్జాతీయ వైద్యసౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజారోగ్య పరిరక్షణమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. మీరంతా హెల్పింగ్ హ్యాండ్స్‌తో సహకరిస్తే రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తయారు చేద్దామని పేర్కొన్నారు. సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇన్‌టెస్టినల్ ఎండోస్కోపి ఆఫ్ ఇండియా (ఎస్‌జీఈఐ) 16వ జాతీయ సదస్సును విశాఖపట్నంలో శుక్రవారం ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ వైద్య నిపుణుల్లో 40 శాతం మంది భారత్‌కు చెందిన వారేనని, వారిలో 25 శాతం మంది ఏపీకి చెందినవారని చెప్పారు. రాష్ట్రంలో కూడా విశాఖకు చెందిన వారే ఎక్కువగా వైద్యరంగంలో ఉన్నారన్నారు. అమెరికాలో కన్నా ఇక్కడ వైద్యం చౌక అని చెప్పారు. విదేశాల్లో రాణిస్తున్న ఇక్కడి వైద్య నిపుణులు ఇక్కడ అత్యుత్తమ వైద్యసౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో ఎండోస్కోపి విభాగంలో అత్యుత్తమ సేవలందిస్తున్న వైద్య నిపుణులను సీఎం సత్కరించారు. తొలుత స్థానిక కేజీహెచ్‌లో అంతర్జాతీయ వైద్య నిపుణులు చేసిన ఎండోస్కోపి శస్త్రచికిత్సలను ప్రత్యక్ష ప్రసారం చేసి వైద్యులకు అవగాహన కల్పించారు.
‘స్మార్ట్ విశాఖ’కు సహకరించండి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అమెరికా భాగస్వామ్యంతో విశాఖ నగరాన్ని అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్ది పెట్టుబడులకు కేంద్రబిందువుగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆయన శుక్రవారం విశాఖపట్నంలో అమెరికా ప్రతినిధులతో నిర్వహించిన విందు సమావేశంలో స్మార్ట్‌సిటీ అంశంపై చర్చించారు. విశాఖను స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు సాంకేతిక, ఆర్థిక సహకారం అందించాలని సీఎం అమెరికా ప్రతినిధులను కోరారు.