మంత్రి లోకేష్‌కు మరో చేదు అనుభవం
ఐదు లక్షల ఉద్యోగాలిచ్చారా.. ఏదీ ఒక్కటైనా చూపండి..
- మంత్రి లోకేశ్‌ను నిలదీసిన ప్రజాసంఘాల నేతలు
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు) /అగ్రికల్చర్/అర్బన్: పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌కు కర్నూలులో చుక్కెదురైంది. రాయలసీమలో ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఆయన చెప్పడంతో ప్రజా సంఘాల నాయకులు జోక్యం చేసుకుని ఉద్యోగాలు వచ్చిన వారిలో ఒక్కరినైనా చూపాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రి నీళ్లు నమిలారు. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి యువతకు ఉపాధి కల్పించాలని కోరుతూ బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాస్, దళిత నేత బాలసుందరం.. శుక్రవారం కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్న మంత్రి లోకేశ్‌కు వినతిపత్రం ఇచ్చారు.
ఆ సమయంలో రాయలసీమలో ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, రాజకీయాలు చేయాలనిచూస్తే మంచిది కాదని మంత్రి అన్నారు. దీంతో ఉద్యోగాలు వచ్చిన వారిలో ఒకరినైనా చూపించాలని ప్రజాసంఘాల నాయకులు కోరగా.. ఇల్లు కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది..? అదేవిధంగా పరిశ్రమలూ స్థాపించడానికి కొంత సమయం పడుతుందని లోకేశ్ పొంతనలేని సమాధానం ఇచ్చారు. అనంతపురంలో కియా మోటార్స్‌కు భూమిపూజ చేశామని చెప్పి జవాబు దాటవేశారు. కాగా నారా లోకేశ్ కాన్వాయ్‌ను ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ( ఈఎస్‌ఎఫ్) నేతలు అడ్డుకున్నారు.