
ఏపీ మంత్రి నారాయణ ఎమ్మెల్సీగా నామినేషన్
హైదరాబాద్: ఏపీ ఎమ్మెల్సీ స్థానానికి రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి. నారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో నారాయణ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఏపీ శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి కె. సత్యనారాయణకు అందజేశారు.
ఎన్నిక ఏక గ్రీవం!: శాసన మండలి సభ్యుడిగా మంత్రి నారాయణ ఎన్నిక ఏకగీవ్రం కానుంది. సోమవారం గడువు ముగిసే సమయానికి నారాయణ నామినేషన్ మాత్రమే దాఖలైంది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగి సిన అనంతరం.. నారాయణ ఏకగీవ్రంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటిస్తారు.
ఆస్తి 185 కోట్లు.. అయినా సొంత కారు లేదు! స్వయంగా రూ. 185.24 కోట్ల ఆస్తులు సంపాదించిన ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణకు సొంత కారు లేదు! ఆయనకు పూర్వీకుల నుంచి రూ. 71.5 లక్షల ఆస్తి సంక్రమించింది. భార్య రమాదేవి పేరుతో రూ. 253.12 కోట్ల ఆస్తి ఉంది. కుమార్తె శరణి పేరుతో రూ. రెండు కోట్ల ఆస్తి ఉంది. సోమవారం నామినేషన్ దాఖలు చేసిన నారాయణ.. తన ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ వివరాల ప్రకా రం ఆయనకు సొంతగా కారు లేకపోవడం గమనార్హం. ఆయన పేరిట బ్యాంకుల్లోని 7 అకౌంట్ల లో రూ. 14 కోట్ల 36 లక్షల 63 వేల 390 నగదు ఉంది.