
సాక్షి, విజయవాడ : ఐదేళ్లు అధికారంలో ఉండి అమరావతిలో ఒక్క పర్మినెంట్ భవనం కట్టకుండా కాలయాపన చేసిన టీడీపీకి రాజధాని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాజధాని పేరుతో గతంలో వేల కోట్ల ఈ టెండర్లు పిలిచి ఇప్పుడు లొల్లి చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు రైతులను మోసం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారని, ఏ ప్రాంతానికి అన్యాయం చేయరని భరోసా ఇచ్చారు. దూరదృష్టితో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సీఎం ప్రయత్నిస్తున్నారని మంత్రి తెలిపారు. 13 జిల్లాలతో కూడిన రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని వివరించారు.
గురువారం విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘రాజధాని తీసుకుపోతారంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. అన్ని అద్దె భవనాలే ఇక్కడికి నుంచి ఏం తీసుకువెళతారు? పవన్ కల్యాణ్ కర్నూలు రాజధాని కావాలన్న మాటలు వాస్తవం కాదా?. బలవంతంగా రైతులు వద్ద లాక్కున్న భూముల ఇచ్చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందే చెప్పారు. టీడీపీ నేతలు రైతుల ముసుగులో రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎదురు కోలేక బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి అసలు రూపం సీఎం జగన్ ఆచరణలో చేసి చూపిస్తారు. కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష చేస్తే బరువును తగ్గుతాడు అంతే అంతకు మించి ప్రయోజనం ఉండదు. ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కన్నా దీక్షలు చేయాలి. గతంలో మోదీ తాట తీస్తానన్న చంద్రబాబు ఇప్పుడు కాళ్ళు పట్టుకునే స్థితికి వచ్చాడు. రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాము’ అని అన్నారు.